Pawan Kalyan JanaSena Complaints to Election commissionగుంటూరు లో రెండు రోజుల క్రితం ఒక సర్వే సంస్థ ప్రతినిధులను అడ్డగించి జనసేనకు చెందిన ఓటర్లను ఓటర్ లిస్టు నుండి తొలగిస్తున్నారని అభియోగించారు ఆ పార్టీ కార్యకర్తలు. జనసేన కు ఓటు వేస్తామని చెప్పగానే వారి ఓటు గల్లంతు అవుతుందని వారి అభియోగం. ఆ సంస్థకు చెందిన ఒకరిద్దరు తెలుగు దేశం అభిమానులు కావడంతో అధికార పార్టీనే ఈ చర్యకు పూనుకుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు.

ఆ పార్టీ నాయకులు ఇప్పటికే దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. “చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను,” అంటూ పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం ట్విట్టర్ లో ఆరోపణ చేశారు.

అయితే గుంటూరు కలెక్టరు దీనిపై స్పందిస్తూ జనసేన ఆరోపణలు కొట్టి పారేశారు. అధీకృత ఎన్నికల సంఘం అధికారులు తప్ప వేరే ఎవరికీ ఓట్లు తీసివేసే అధికారం ఉండదని వీటి పై వస్తున్నవన్నీ అనుమానాలు అపార్ధాలే అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాత్రం దీనితో సంతృప్తి చెందలేదట. మరోవైపు అధికార పార్టీ నాయకులు ఈ అభియోగాలను కొట్టిపారేస్తున్నారు. కనీసం రాజకీయ జ్ఞానం లేకుండా చేస్తున్న ఈ ఆరోపణలలో పస లేదని, జనసేన నాయకులు రాబోయే ఓటమికి కారణాలు ఇప్పటినుండే వెతుకుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.