Pawan-Kalyan-Chandrababu-Naiduరాజమహేంద్రవరం మహానాడులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కొన్నిటిని ప్రకటించడం ప్రత్యర్ధులనే కాదు… సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. “ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్దమేనంటూ,” చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాటలను అందరూ యధాలాపంగా తీసుకొన్నారే తప్ప ఆయన ఇంత త్వరగా ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు.

ఎన్నికలలో సంక్షేమ పధకాలతో టిడిపిని దెబ్బ తీయాలని వైసీపీ అనుకొంటే, వాటినే చంద్రబాబు నాయుడు తిరిగి తమపైకి ప్రయోగించడంతో వైసీపీలో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే, వాటిని కొనసాగించగలమని హామీ ఇవ్వలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏవో కాకమ్మ కధలు చెప్పే ప్రయత్నం చేస్తే ఎండగడదామని వైసీపీ నేతలు చాలా కాలంగా కాసుకు కూర్చోన్నారు. అసలు చంద్రబాబు నాయుడు వాటిని ఏవిదంగా ఎదుర్కొంటారో చూడాలని తహతహలాడిపోయారు. చివరికి చంద్రబాబు నాయుడు సంక్షేమ పధకాలనే ‘గేమ్ ఛేంజర్‌’గా వారిపై ప్రయోగించడం వైసీపీ నేతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

అనేక అవరోధాలను అధిగమించి దిగ్విజయంగా మహానాడు సభలు నిర్వహించుకోవడంతో టిడిపి శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తమ అధినేత వైసీపీని ఇరుకున పెడుతూ సంక్షేమ పధకాల అస్త్రం ప్రయోగించడంతో వారి ఉత్సాహానికి అంతే లేదు. కనుక ఇదే ఊపులో జనసేనతో పొత్తులు, సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్ధులను కూడా ప్రకటించేస్తే టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా జనసేన టిడిపితో ఉంటుందా లేక బిజెపితో ఉంటుందా? టిడిపితో ఉండే మాటయితే ఏఏ నియోజకవర్గాలలో ఏ పార్టీ పోటీ చేస్తుంది? అనే విషయం తేలకపోవడం వలన రెండు పార్టీల శ్రేణులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటోంది. కనుక ఈ రెండు విషయాలపై కూడా చంద్రబాబు నాయుడు త్వరగా నిర్ణయం తీసుకొంటే, రెండు పార్టీలకు పూర్తి స్పష్టత వస్తుంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది టికెట్‌ ఆశిస్తున్న కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్ధులను ఖరారు చేసేస్తే తాము నియోజకవర్గాలలో పని మొదలుపెట్టుకోగలమని అనుకొంటున్నారు.

టిడిపి, జనసేనల కోసం కాకపోయినా వాటిపై కడుపు మంటతో రగిలిపోతున్న మాకోసం అయినా రెండు పార్టీలు పొత్తులు, సీట్ల విషయంలో తేల్చేసుకొంటే బాగుంటుందని వైసీపీ నేతలు కూడా కోరుకొంటున్నారు కదా?