Pawan Kalyan Janasena party రాజకీయంగా ఎలాంటి సంచలనం కలిగించని ‘జనసేన’కు కాకినాడ సభ మంచి అవకాశాన్ని ఇచ్చింది. అయితే అనుభవ రాహిత్యంతో దానిని ‘జనసేన’ అధినేత దుర్వినియోగం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఓ పక్కన ప్రతిపక్ష నేత జగన్ ఎన్ని పోరాటాలు, ఎంత హంగామా, నిరసనలు వంటివి చేస్తున్నా ప్రజలను ఆకర్షించడంలో విఫలమవ్వడంతో… జనసేన అధినేత అదరగొడతారని అంతా భావించారు. అయితే కోర్టు వాయిదాల తరహాలో తన నిరసనను కూడా వాయిదా వేసుకున్నాడు పవన్ కళ్యాణ్.

ఇదంతా గతం. కాకినాడ సభలో ‘ప్రత్యేక హోదా’ కోసం గళం విప్పాల్సిన సమయం ఇంకా ఉందన్నట్లుగా వ్యాఖ్యానించడంతో… రేపు 10వ తేదీన జరగబోయే అనంతపురం సభలో ఆ సమయాభావంపై ప్రకటన వస్తుందా? లేక ఆకాశమే హద్దుగా చెలరేగుతారా? ఒకవేళ అదే జరిగితే ప్రజల నుండి మద్దతు కూడగట్టుకోగలుగుతారా? నిలకడలేనితనం పవన్ కళ్యాణ్ ను మొదటి నుండి వెన్నాడుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అది కొనసాగడం తన ఎదుగుదలను తానే తోక్కేసుకున్నట్లు అవుతుంది.

ఇప్పటికే తిరుపతి సభకు – కాకినాడ సభకు పూర్తి వ్యత్యాసాన్ని చూపించి విమర్శల పాలయ్యాడు. దీంతో అనంతపురంలో ఒక స్పష్టమైన వైఖరితో ప్రణాళికలు ప్రకటించకుండా కాలయాపన సమావేశాలు నిర్వహిస్తే… ‘రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలు చేసుకోమన్న’ ఉచిత సలహాలు కూడా పెచ్చుమీరవచ్చు. దీంతో అనంతపురం సభ జనసేన భవిష్యత్తుకు ఓ బాటగా మారింది. దానిని సరైన దారిలో పెడతారో లేక దారి తప్పి ప్రయాణిస్తారో, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది.