Pawan kalyan janasena alliance with bjpతూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ దాడుల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కాకినాడలో 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు ఆయన అరెస్టు చేస్తారని జిల్లా వ్యాప్తంగా పుకార్లు వ్యాపించడంతో జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

పవన్‌పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ద్వారంపూడి స్పష్టం చేయగా… ద్వారంపూడిని అరెస్టు చేసే వరకు ఉద్యమిస్తామని జనసేన శ్రేణులు తేల్చిచెప్పారు. ద్వారంపూరి ఇదివరలో పవన్ కళ్యాణ్ రాయడానికి వీలు లేని భాషలో దూషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో జనసేన నాయకులు ఆదివారం ద్వారంపూడి నివాసం ముట్టడికి యత్నించారు.

కాకినాడ భానుగుడి కూడలిలో మొదలైన ఈ ఆందోళనలో సీఎం, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను తగులబెట్టే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ భాస్కర్‌నగర్‌లో జనసేన ర్యాలీపై వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే మద్దతుదారులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. రెండు వర్గాల వారు కలపడగా కేవలం జనసేన వారి మీదే కేసులు నమోదు చెయ్యడం ఉద్రిక్తతకు దారి తీసింది.

ఢిల్లీ యాత్ర నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీ కలిసి పని చెయ్యబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయినా సరే అధికార పక్షం పవన్ కళ్యాణ్ కు తమ పవర్ చూపించే ప్రయత్నమే చేస్తుండడం విశేషం. గాయపడిన కార్యకర్తలను పరామర్శించాక జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. భవిష్యత్ కార్యచరణపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు.