Pawan kalyan janasena alliance with bjp while amaravti farmers agitationఒక తెలుగు టీవీ ఛానల్ ప్రసారం చేసిన వార్త ప్రకారం రేపు జనసేన పార్టీ, బీజేపీ నేతల కీలక సమావేశం జరుగుతుందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశం ఇరు పార్టీల వారూ చర్చిస్తారని ఆ వార్త సారాంశం. ఈ వారం మొదట్లో ఢిల్లీ వెళ్లి పవన్ కళ్యాణ్ బీజేపీ కీలక నాయకత్వంతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది.

కొంత మంది ఆర్ఎస్ఎస్ నాయకులతో కూడా చర్చలు జరిపారు. రెండు పార్టీలు కలిసి పని చెయ్యాలని, సంయుక్తంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత అటు పవన్ కళ్యాణ్ గానీ ఇటు బీజేపీ నేతలు గానీ వాటిపై స్పందించలేదు. అయితే తెరవెనుక మరిన్ని చర్చలు జరుగుతున్నాయని మాత్రం తెలుస్తుంది.

అయితే ఈ వార్త మీద మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను వారు ప్రస్తావిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి వంటి కీలక విషయం పై చర్చ జరుగుతుంటే పొత్తుల కోసం వెంపర్లాడటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు అర్థ బలం, అంగ బలం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ తమకు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక జనాకర్షణ కలిగిన నాయకుడు దొరికాడని సంబరపడుతుంది. మొన్నటి ఎన్నికలలో బీజేపీకి సున్నా సీట్లు, జనసేనకు కేవలం ఒక్క సీటు వచ్చిన సంగతి తెలిసిందే.