జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. వారి మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలకు గట్టిగా పాతిక రోజులు కూడా లేవు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా ఉత్తర్ ప్రదేశ్ వెళ్ళి బహుజన్ సమాజావాది పార్టీ అధినేత్రి మాయావతిని కలిశారు. తమ పార్టీ బీఎస్పీ తో పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించారు. పైగా మాయావతిని తాము దేశప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.

బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే ఏమొస్తుందో ఎవరికీ అంతుబట్టని ప్రశ్న… పైగా మాయావతిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మకిలి ఎందుకు అంటించుకుంటున్నారో అర్ధం కానీ ప్రశ్న. దీనివల్ల దళితుల ఓట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ అంచనా కావొచ్చు. వారిలో ఎక్కువ శాతం జగన్ వైపు ఉన్నారు. మాయావతి అంతగా ప్రభావం చూపించగలిగే నేత అయితే ఆమె పార్టీనే ఇక్కడ ప్రబల శక్తిగా ఉండేది. మరి పవన్ కళ్యాణ్ ఉద్దేశమేంటో అర్ధం కాదు.

ఒకవేళ జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపించటానికి అనుకుంటే జనసేన రాష్ట్రంలోనే ఇబ్బంది పడుతుంది. ఇప్పటికి కేవలం 32 ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటించగల్గింది. మిగతా పని చూడకుండా ఉత్తర్ ప్రదేశ్ యాత్ర ఏంటో? ఇప్పుడు ఆ సంగతి చూడకుండా జాతీయ రాజకీయాలేంటో? ఎన్నికలు సమీపించే కొద్దీ పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతున్నారు. దీనికి ఆయన వచ్చే ఎన్నికలలో భారీ మూల్యమే చెల్లించాల్సి రావొచ్చు.