Pawan-Kalyan-Jana-Sena-Vs--JDS-Karnatakaఅవును… ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహల పల్లకిలో ఊగుతున్నారు. ‘అజ్ఞాతవాసి’ దారుణ పరాజయం… రాజకీయంగా పవన్ ను బిజెపి నడిపిస్తోందని విమర్శలు… పవన్ పై మీడియా కినుక వహిస్తూ కవరేజ్ ను పక్కన పెట్టిన విధానం… ఇన్నింటి నడుమ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందం ఎక్కడ నుండి వస్తోంది? అంటే… దానికి సమాధానమే సోమవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి.

కర్ణాటక సిఎంగా యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటు చేయమని గవర్నర్ ఆదేశించగా, సోమవారం నాడు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేసారు. 104 సీట్లు వచ్చిన బిజెపికి, 78 సీట్లు వచ్చిన కాంగ్రెస్ కు లభించని సిఎం పీఠం 30 పై చిలుకు సాధించిన జేడీఎస్ నేతకు దక్కడంతో, 2019 ఆంధ్రప్రదేశ్ లో తమ అభిమాన హీరో, ‘జనసేన’ అధినేతకు కూడా ఇదే అవకాశం దక్కుతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊహలలో మునిగి తేలుతున్నారు.

అంటే 175 స్థానాలలో పోటీ చేయబోతున్న ‘జనసేన’కు 20-30 మధ్య మాత్రమే వస్తాయని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారా? పూర్తి స్థాయిలో పవన్ ను నమ్మే ప్రజానీకం లేదని ఈ సందర్భంగా చెప్పకనే చెప్తున్నారా? పవన్ స్థానం కేవలం ‘కింగ్ మేకర్’ వరకే పరిమితమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫ్యాన్స్ ఊహలు, ఆశలు ఎలా ఉన్నా… ప్రస్తుత జనసేన పరిస్థితిని విశ్లేషిస్తూ… ఆ ‘కింగ్ మేకర్’గా అవతరించినా చాలా గొప్పే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.