Pawan Kalyan Jana Sena Vs BJP AP‘స్పెషల్ స్టేటస్’ కోసం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ముదురుతోంది. కేంద్రం ఇచ్చే అవకాశం లేదని పదే పదే చెప్పి, ఫైనల్ గా ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో ఆ స్పెషల్ స్టేటస్ బెనిఫిట్స్ ఇస్తామని… ఇటీవల ఆ ప్యాకేజ్ కు చట్టబద్ధత కూడా కల్పించింది. దీంతో ఖచ్చితంగా రాదని తెలిసిన వైసీపీ ఇంకా ‘స్టేటస్’ రాజకీయం చేస్తుండగా, ‘జనసేన’ అధినేత కూడా పవన్ కళ్యాణ్ కూడా తాను తక్కువేమీ కాదన్నట్లు వైసీపీకి వంత పాడుతున్నారు.

ఒకప్పుడు ఢిల్లీలో చెప్పడం కాదు, ఏపీకి వచ్చి చెప్పండి… అప్పుడు ప్రజలు ఏమీ అనకపోతే నేను ఒప్పుకుంటాను అన్న భావాలను పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచిన తర్వాత, చాలామంది కేంద్ర మంత్రులు ఏపీలో ఈ విషయంపై చాలా సందర్భాలలో అధికారిక ప్రకటన చేసారు. అలాంటి సమయంలో కనీసం నోరు కూడా మెదపకుండా, ‘ఇంకా చాలా సమయం ఉంది, వేచిచూద్దాం’ అంటూ కాలయాపన చేసి, ప్రస్తుతం మాత్రం ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బిజెపి అధిష్టాన వర్గం కాస్త గుర్రుగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఏపీ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఈ దిశగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. “ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ ఉద్యమం చేస్తాననడం హాస్యాస్పదంగా మారిందని, ప్రత్యేక హోదా ఈజ్ క్లోజ్డ్ ఛాప్టర్” అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తేల్చిచెప్పారు.

ప్రత్యేక హోదా మీద ఎవరైనా ఉద్యమం చేస్తామంటే… మళ్లీ సమైక్యాంధ్రపై ఉద్యమం చేసినట్టు ఉంటుందని ఎద్దేవా చేసిన బిజెపి ఎమ్మెల్యే, ప్రత్యేక హోదా పేరు చెప్పి, ప్రజల సమయం వృథా చేయవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతోందని, హోదా కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ఉందని సమర్ధించుకున్నారు. దీంతో మళ్ళీ పవన్ నుండి ఎలాంటి కౌంటర్ ట్వీట్ వస్తుందో చూడాలి.