Please-Be-Responsible,-Pawan-Kalyan!తమిళ టాప్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “స్టాలిన్” సినిమా మూలకధ అందరికీ తెలిసిందే. ‘తను ఒకరికి సహాయం చేసి, వారిని మరో ముగ్గురికి సహాయం చేయమనే’ సిద్ధాంతంతో తెరకెక్కించారు. అయితే ఈ భావజాలం మెగాస్టార్ చెప్పినా గానీ, అంతగా రక్తి కట్టలేదు. దీంతో ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. తాజాగా పవర్ స్టార్ కూడా ఇదే సిద్ధాంతాన్ని తనదైన శైలిలో తెరపైకి తీసుకువచ్చారు.

మొన్నటివరకు అధికారం వద్దు, పదవులు వద్దు అంటూ చెప్పిన పవన్, ప్రస్తుతం జగన్ మాదిరే సిఎం సీటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. దీంతో అభిమానులు ఏకంగా పవన్ సిఎం అయిపోయినట్లుగా ఊహల పల్లకిలో ఊరేగుతూ… పవన్ పోరాటయాత్ర చేస్తోన్న ప్రతి ప్రాంతంలో ‘సిఎం సిఎం’ అంటూ నినాదాలు చేస్తున్నారు. తనకు ఎంత బలం ఉందో తెలిసిన పవర్ స్టార్ మాత్రం, ‘మీరు సిఎం సిఎం అంటే నేను ముఖ్యమంత్రిని అవ్వను, మీరు వెళ్లి జనసేనకు ఓటు వేస్తే అవుతాను’ అంటూ పిలుపునిస్తున్నారు.

ఈ స్వరం ఇంకాస్త పెరుగుతూ… సభకు వచ్చిన వారంతా ఒక్కొక్కరు మరో 500 మందితో ఓట్లు వేయించండి, అప్పుడు నేను సిఎం అవుతా… అంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు. అంటే పవర్ స్టార్ ఒక్కో అభిమాని మరో 500 ఓట్లను పోగేయ్యాలన్న మాట. నాడు చిరంజీవి ‘స్టాలిన్’ ద్వారా చెప్తే ప్రేక్షకులు తిరస్కరించారు… మరి నేడు పవన్ రియల్ లైఫ్ “స్టాలిన్”లా చెప్తే ప్రజలు ఏం చేస్తారో అనేది తెలియాలంటే, మరో ఏడాది వరకు వేచిచూడాలి.