Pawan-Kalyan-Proposed-Alliance-with-YS-Jaganజనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఒక చోట మాట్లాడుతూ రాజకీయాలలో దివంగత నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వారు విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ఇప్పుడు అటువంటి నాయకులు లేకుండా పోయారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి అటుంచితే గతంలో పవన్ వైఎస్ గురించి పరస్పర విరుద్ధమైన మాటలు చెప్పారు.

ప్రజారాజ్యం సమయంలో అప్పటి యువరాజ్యం అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వైఎస్ పై ఆయన ప్రభుత్వంపై ఎలా ఊగిపోయారో అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 ఎన్నికల సమయంలో కూడా పవన్ జగన్ పై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. వైఎస్ ప్రమేయం లేకుండా గవర్నమెంట్ లో లేని జగన్ అవినీతి చేశారని పవన్ భావించారా? భావిస్తున్నారా?

సరే అప్పటి సంగతులు పక్కన పెడితే మొన్న ఈ మధ్యనే తనను ఒక సినిమా తీయమని వైఎస్ ఒత్తిడి చేసినట్టుగా పవన్ చెప్పారు. తనలాంటి వారికే ఇటువంటి బెదిరింపులు ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని పవన్ అప్పటిలో బాధ పడినట్టుగా చెప్పుకొచ్చారు. ఆ మాట చెప్పి పట్టుమని పదిరోజులైనా కాలేదు అప్పుడే వైఎస్ విలువల తో కూడిన రాజకీయాలు చేశారు అంటే ఏమనుకోవాలి? పవన్ అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తున్నా మాటలలోని నిజానిజాలు పక్కన పెడితే రాజకీయాలలో ఇంత త్వరగా అభిప్రాయాలు మార్చేసుకుంటే నిలకడలేని తనం అనుకునే ప్రమాదం ఉంది. దీనిని ఎంత త్వరగా గ్రహించి అంత త్వరగా మార్చుకుంటే పవన్ కు అంత మంచిది.