Pawan-Kalyan's-Comeback-Now-Official,-Political-Ambitions-in-Troubleఎన్నికల తరువాత తన మొదటి రాజకీయ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పక్షం మీద విరుచుకుపడ్డారు. ఇసుక కొరతతో అల్లాడుతున్న ఆ రంగం కార్మికులను ఆదుకోవడానికి, ఇసుకను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వానికి రెండు వారాల టైం ఇచ్చారు పవన్. లేకపోతే ఈ సారి అమరావతి వీధులలో నడుస్తా అంటూ హెచ్చరించారు.

ఇదే సమయంలో తనను చంద్రబాబు దత్త పుత్రుడు అంటూ విమర్శలు చేస్తున్న అధికారపక్ష నాయకులు మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబుల మీద పవన్ కళ్యాణ్ ఒంటికాలి మీద లేచారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే విజయసాయిరెడ్డికి నన్ను విమర్శించే నైతిక హక్కు ఉందా అని పవన్ ప్రశ్నించారు. ఆయన ప్రజా సమస్యలపై పోరాడో, పౌరహక్కుల కోసమో జైలుకెళ్లలేదని, సూట్ కేసు కంపెనీలు పెట్టి మనీలాండరింగ్ కు పాల్పడి జైలుకెళ్లారని ఎద్దేవా చేశారు.

విజయసాయిరెడ్డి చేసే ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే వారికి కళ్లు నెత్తికెక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశిష్ఠమైన వ్యక్తులుండాల్సిన రాజ్యసభలో సూట్కేసు కంపెనీలు పెట్టి జైలుకెళ్లొచ్చిన విజయసాయిరెడ్డి కూర్చుంటున్న పరిస్థితి వచ్చిందని, అలాంటి వ్యక్తి తనను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.

గత నెల రోజులుగా అధికార పక్షనేతలు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. టీడీపీ బీ-టీం అని ప్రజలలోకి బలంగా తీసుకుని వెళ్లడం వల్లే తాము ఎన్నికలలో నష్టపోయామని జనసేన అంచనా. అయితే ఎన్నికల తరువాత కూడా అటువంటి వ్యాఖ్యలే చేసినా చేస్తున్నా జనసేన మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఇటువంటి పెద్ద మీటింగ్ పెట్టి మాట్లాడితే తప్ప అది ప్రజలకు చేరదు. ఈలోగా జరగాల్సిన నష్టం ప్రతి సారీ జరిగిపోతుంది. దీనిపై జనసేన దృష్టి సారించకపోతే నష్టపోవడం ఖాయం.