jana sena party election symbolవచ్చే ఎన్నికలలో ఏపీలో 175 స్థానాలలో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాం అంటూ స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, అంతే నమ్మకంతో అధికారం కూడా జనసేనదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బహుశా తన సినీ గ్లామర్ కున్న క్రేజ్ తో వచ్చిన ప్రజలను చూసి పవన్ కళ్యాణ్ కు ఆ నమ్మకం కలిగి ఉండవచ్చు. అయితే రాజకీయాలలో నమ్మకం ఒక్కటే సరిపోదు, ప్రజల చేత ఓట్లు వేయించడానికి ఖచ్చితమైన ప్రణాళిక కావాలి.

మరి ఆ ప్రణాళిక పవన్ వద్ద ఉందా? అంటే నోరెళ్ళబెట్టాల్సిందే. అధికార పక్షం మీద విమర్శలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ను కొల్లగొట్టాలని చూస్తున్నారు గానీ, అసలైన కీలక అంశాన్ని పవన్ విస్మరించినట్లుగా కనపడుతోంది. మామూలుగా అయితే ఎన్నికలకు దాదాపుగా మరో 10 నెలల వరకు సమయం ఉంది గానీ, ముందస్తు ఎన్నికలకు వస్తే మాత్రం మరో అయిదు నెలల్లో అంతా సిద్ధం కావాల్సి ఉంది. అందుకు జనసేన మాత్రం సిద్ధంగా లేదనే చెప్పాలి.

అన్ని స్థానాలకు అభ్యర్ధులు ఉన్నారో తెలియదు. కనీసం ఉన్న అభ్యర్ధులను గెలిపించుకోవడనికైనా పార్టీ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఏదో సినిమా టైటిల్ లాగా మీడియా ద్వారా ప్రకటన ఇప్పిస్తే, ధియేటర్ కు వచ్చేసినట్లు ఓటింగ్ బూతు దగ్గరకు వచ్చేసి ఓట్లేమీ గుద్దేయరని పవన్ గుర్తించాలి. పార్టీకి కామన్ సింబల్ ను ఎలక్షన్ కమీషన్ ప్రకటించాల్సి ఉంటుంది, కానీ దానికి సంబంధించిన చర్యలన్నీ పార్టీ అధినేతే తీసుకోవాల్సి ఉంది.

ఇప్పటివరకు పార్టీ గుర్తుపై పవన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం తాము ఈసీకి అభ్యర్ధించామని కూడా పవన్ చెప్పలేదు. గతంలో ప్రజారాజ్యం విషయంలో కూడా చివరివరకు ఇదే సస్పెన్స్ కొనసాగడం పార్టీకి పెద్ద మైనస్ గా మారిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు జనసేన విషయంలో పవన్ పలు జాగ్రత్తలు తీసుకొని పక్షంలో చివరి నిముషంలో వచ్చే కామన్ సింబల్ కూడా పార్టీకి ఎందుకు ఉపయోగపడదని తెలుసుకోవాలి.