Pawan Kalyan Jana Sena Party Alliance2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ గా పరిగణిస్తున్న నంద్యాల ఉప ఎన్నికలలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఎటు వైపు నిలవబోతున్నారు? గత సార్వత్రిక ఎన్నికలలో తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలిపిన పవన్ కళ్యాణ్, అదే బాటలో పయనిస్తూ తెలుగుదేశం పార్టీకి పచ్చజెండా ఊపుతారా? లేక వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అంటూ పరోక్షంగా వైసీపీకి దోహదం చేస్తారా? లేక ఎవరికీ మద్దతు తెలుపకుండా తటస్థంగా ఉంటారా? దీనిపై పొలిటికల్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పవన్ నుండి నేడు సమాధానం వెలువడనుండడంతో, అందరి చూపులు పవన్ వైపుకు మళ్ళాయి.

అయితే పొలిటికల్ టాక్ ప్రకారం అయితే…. నంద్యాల ఉపఎన్నికలతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం అధికార వర్గానికి అనుకూలంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. లేని పక్షంలో అక్టోబర్ నుండి ప్రజల్లోకి వస్తానని చెప్పడంతో, టిడిపికి మద్దతు ప్రకటిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో పవన్ ప్రస్తుతానికి తటస్థంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదన్న భావన కూడా బలంగానే వ్యక్తమవుతోంది. వైసీపీకి మద్దతు తెలిపే ప్రసక్తి లేదని పొలిటికల్ వర్గాలు బల్లగుద్ది చెప్తున్నప్పటికీ, చంద్రబాబుకు జలక్ ఇవ్వాలని భావిస్తే ఈ దిశగా నిర్ణయం ఉండవచ్చు.