pawan-kalyan-jana-sena-on-notes-ban-or-movieభారతదేశ రాజకీయాల్లో సమూల మార్పు కావాలని కోరుకుంటున్న ‘జనసేన’ అధినేత సిద్ధాంతాలు కొంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి. అయితే అందుకు అనుగుణంగా పార్టీని ముందుకు నడుపుతున్నారా? అంటే తెల్లముఖం వేయాల్సిందే. ఎప్పుడు ఎలా ఏం మాట్లాడతారో బహుశా ‘జనసేన’ అధినేతకైనా తెలుసా? అనే ప్రశ్నలను రాజకీయ విశ్లేషకులు పలు సందర్భాలలో వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ‘జనసేన’ అధినేత చేసిన ట్వీట్లపై కూడా విశ్లేషకులు అదే రకమైన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

దేశమంతా ‘నోట్ల రద్దు’ సమస్యతో సతమతమవుతుంటే… ఎప్పుడో గడిచిపోయిన గోమాంసం, రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతాల గురించి ప్రస్తావించడం వర్తమాన రాజకీయాల నుండి దూరంగా జరగడం కాదా? రోహిత్ వేముల ఆత్మహత్య గురించి బహుశా వారి కుటుంబ సభ్యులు కూడా మరిచిపోతూ ఉండవచ్చు? మళ్ళీ ఆ ఉదంతాన్ని గుర్తు చేయడమంటే వారి గర్భశోకాన్ని మళ్ళీ జ్ఞప్తికి తీసుకురావడమే కదా! అలాగే ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఇప్పటికే నాన్చి నాన్చి చేసిన పసలేని ప్రసంగాలకు కొదవలేదు. మళ్ళీ కొత్తగా ఏం మాట్లాడతారు?

వాస్తవానికి పవన్ ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా చర్చించదగ్గవే, మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నవే. అయితే వేటికైనా సమయం, సందర్భం ఉండాలి. ‘కర్మకాండలు’ జరిగే సమయంలో ‘పెళ్లి మంత్రాలు’ చదువుతానంటే కుదరదు. ‘జనసేన’ అధినేత అవలంభిస్తున్న తీరు కూడా ఇలాగే ఉంటోందని విశ్లేషకులు వాపోతున్నారు. అందులోనూ చెప్పాల్సిన నాలుగు ముక్కలు సూటిగా చెప్పకుండా… విడతల వారీగా రోజుకొక విషయంపై స్పందిస్తానని చెప్పడం మరింత హాస్యాస్పదంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లకు లెక్కేలేదు.

‘ఏం… తదుపరి అంశంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రెడీ కాలేదా? లేక ప్రిపేర్ కాలేదా?’ అంటూ పవన్ కళ్యాణ్ విధానాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. అవును… పవన్ కళ్యాణ్ ఇలాగే అవగాహనా రాహిత్యపు రాజకీయాలు చేస్తే… ఖచ్చితంగా అభిమానులే ప్రశ్నించే రోజులు వస్తాయి. అందులోనూ పవన్ తానూ వెల్లడించే ప్రతి విషయాన్ని… తన అభిప్రాయంగా కాక, అనేక మందితో చర్చించానని, వాళ్ళందరూ చెప్పిన విషయాలే మీకు చెప్తున్నానని చెప్పడం… ఒక నాయకుడు లక్షణాలు ఏ మాత్రం కాదు.

ఎప్పుడైనా ఒకటి, రెండు సార్లు చెప్పడం వరకు అయితే ఎవరూ విమర్శలు చేయరు గానీ, చెప్పే ప్రతి విషయాన్ని నిపుణులు, సీనియర్లు, విశ్లేషకులు… అంటూ ఇదే రీతిలో పవన్ ప్రస్తావిస్తుండడంతో… తనకేమీ అవగాహన లేదన్న విషయాన్ని స్వయంగా పవనే ఒప్పుకున్నట్లు అవుతుంది. అప్పుడు “నాయకుడు” అన్న దానికి అర్ధం ఏముంటుంది? మరి పవన్ కు ఎవరు రాజకీయ సలహాలు ఇస్తున్నారో గానీ… అవి పరిణితి చెందిన వ్యక్తులవి కాకుండా, ‘చిన్నపిల్లల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయన్న’ టాక్ సర్వత్రా వినపడుతోంది.