Pawan-Kalyan-Jana-Senaనంద్యాల ఉప ఎన్నికలో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తారో అనే విషయంపై పొలిటికల్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికల ముందు వస్తున్న ఈ ఉప ఎన్నికలో ‘గెలుపు’ అనే మాట ఇటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, అటూ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కీలకమే. ఈ నేపథ్యంలో… పవన్ ఎటు వైపు మొగ్గు చూపుతారు? ప్రస్తుత పరిస్థితులలో జగన్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపే అవకాశం లేదు గనుక, అధికారంలో ఉన్న టీడీపీకి మరోసారి తన సహకారం ప్రకటిస్తారా? లేక తటస్థంగానే ఉండిపోతారా? అనే విషయంపై టెన్షన్ వాతావరణం నెలకొంది.

సోమవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత, నంద్యాల ఉప ఎన్నికలో ఎవరికి మద్దతు ఇస్తాననే విషయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. దీంతో పవన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు టీడీపీ, వైసీపీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. గెలుపు కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నియోజకవర్గంలో బలిజలు, ముస్లింలు, ఆర్య వైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అయితే వీరిలో దాదాపు పవన్ సామాజిక వర్గంలో భాగమైన 42వేల మంది బలిజ ఓటర్లు ఉన్నారు.

దీంతో ఒకవేళ పవన్ టీడీపీకి మద్దతు ప్రకటిస్తే, ఆ నిర్ణయం ఈ సామాజిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తద్వారా, టీడీపీకి బలిజ ఓట్ల శాతం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. నియోజక వర్గంలో ఉన్న మరో 25 వేల నుంచి 35 వేల మంది పవన్ అభిమానులు, సేవాదళ్ సాధారణ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ ఆశయ సాధన సమితి సభ్యులు ఉన్నారు. దీంతో పవన్ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. మరోవైపు మంత్రి భూమా అఖిలప్రియ మాత్రం… పవన్ కళ్యాణ్ తో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని, ఆయన మద్దతు తమ కుటుంబానికి ఎప్పుడు ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.