Pawan Kalyan Not Looking for Enmity with Jagan?మీడియా తన చేతిలో ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అన్న ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఇప్పటికే 99 ఛానల్ ను జనసేన ఛానల్ గా ప్రమోట్ చేసుకుంటున్న పవన్, వైసీపీ అధినేత జగన్ మాదిరే తన ప్రసంగాలకు సొంత మీడియా సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్న వైనం సోషల్ మీడియాలో కళ్ళకు కట్టినట్లుగా కనపడుతోంది.

ఏది ఏమైనా… ఆ ఛానల్ కు వీక్షకుల సంఖ్య ఉన్నా లేకపోయినా… తనకంటూ ఓ ఎలక్ట్రానిక్ మీడియాను ఏర్పాటు చేసుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు. అదే ఊపులో ఒకప్పటి వెలుగు జిలుగు అయిన ఆంధ్రప్రభ కూడా జనసేన అధినేతకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఈ పేపర్ ను మాత్రమే కొనండి అంటూ జనసైనికులు నెట్టింట తెగ పబ్లిసిటీ చేస్తున్నారు.

అంటే పవన్ ఖాతాలో ఓ ఎలక్ట్రానిక్ మరియు ఓ ప్రింట్ మీడియా సంస్థలు ఉన్నట్లే! ఇంకేముంది… సిఎం పీఠం ఎక్కేసినట్లే..! నిజంగా ఓ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలు తమ చేతిలో ఉంటే ముఖ్యమంత్రి అయిపోవచ్చా? ఒకవేళ ఇదే నిజమైతే జగన్ ఈ పాటికి రెండు సార్లు ముఖ్యమంత్రి కావాలి కదా! మరి జగన్ ను చూసైనా పవన్ నేర్చుకోవాలి కదా! అయితే ఆ ఛాయలేవీ పవన్ లో మచ్చుకైనా కనిపించకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే విషయం.