pawan-kalyan-jana-sena-cpiకొద్ది నెలల క్రితం జనసేన, కమ్యూనిస్టులు కలిసి కొన్ని ప్రజా ఉద్యమాలు చేసాయి. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తన జనసేన పోరాట యాత్ర మొదలు పెట్టారు. అన్ని జిల్లాలకు తిరిగి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను నిర్వహిస్తున్నారు ఆయన. ప్రజలతో మరింతగా మమేకం అయ్యేందుకు ఆయన రాజమహేంద్రవరం నుండి రంపచోడవరంకు బస్సు యాత్ర చేస్తున్నారు.

నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకొనే దిశగా ఈ బస్సు పర్యటన చేస్తున్నారు. ఈ ప్రయాణంలో పలు గ్రామాల్లో గిరిజనులతో పవన్‌ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ ప్రయాణంలో కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు. ఈ బస్సు ప్రయాణంలో ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ప్రజలతో కలిసి ప్రయాణించారు. కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ తో కలిసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యాలని అనుకున్నారు.

కాకపోతే పవన్ కళ్యాణ్ పోటీ గురించి ఏమీ తేల్చకుండా చివరికి పోటీ నుండి తప్పుకున్నారు. ఆయన వైఖరితో విసిగిపోయిన వామపక్ష నేతలు జనసేనతో ఆంధ్రప్రదేశ్ లో కలిసి పని చెయ్యడంపై అనుమానాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు పవన్ కళ్యాణ్ పక్కన తిరిగి ప్రత్యక్షం అవ్వడం రాజకీయ పక్షాలలో చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు ప్రజలతో మమేకం అవ్వడానికి గతంలో పవన్ కళ్యాణ్ రైలు ప్రయాణం కూడా చేసిన సంగతి తెలిసిందే.