pawan-kalyan-politics-moviesజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 వరకు జరిగే అన్ని ఎన్నికలలో తమ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని వారు చెప్పుకొచ్చారు. అయితే జనసేనకు ఈ పొత్తు వల్ల ఏం ఒరిగిందో అర్ధం కాకుండా ఉంది. వెనుక ఏమైందో ఏమో గానీ బీజేపీతో పొత్తు తరువాత పవన్ కళ్యాణ్ అమరావతి ఇష్యూని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరకూ కనీసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం కూడా రాలేదు. జనసేన పార్టీకి బీజేపీ నుండి ఏమైనా సహకారం లభిస్తుందా అంటే అది కూడా లేదు. మామూలుగానే రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్దగా యాక్టీవ్ గా ఉండరు. ఇప్పుడు కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు.

పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఎజెండాని మోస్తూ ఉండాల్సిన పరిస్థితి. ఇటీవలే ప్రవేశపెట్టిన బుడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఏమీ ఇవ్వకపోయినా స్వాగతించాల్సిన పరిస్థితి. అది కూడా పక్కన పెడితే ఇటీవలే కాలంలో కేంద్రం తెచ్చిన వివాదాస్పదమైన సీఏఏ, ఎన్ఆర్సీ ల గురించి ప్రతి మీటింగ్ లోను పవన్ కళ్యాణ్ సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు.

ఈ రెండు విషయాల పై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాట్లాడినంత కూడా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడలేదు. అంటే అతిశయోక్తి కాదు. దీనితో అసలు ఈ పొత్తు వల్ల ఎవరికి లాభం అనే ప్రశ్నలు జనసైనికులలోనే కలుగుతున్నాయి. కొందరైతే ఏకంగా దారిన పోయే దరిద్రాన్ని మీద వేసుకున్నాడు పవన్ అంటున్నారు.