Pawan-Kalyan-Twists-Special-Status-Issue-On-To-TDP‘ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు…. ముంతమామిడి పండన్నాడే గంగరాజు… హస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు… నన్నోగ్గేసి వెలిపోనాడే గంగరాజు…’ అన్న ఓ ఫేమస్ సాంగ్ తెలుసు కదా! సరిగ్గా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ‘ఎవరి వీపు వాళ్లకు కనపడదు’ అన్న చందంగా… తాను చేసిన తాత్సారంను పక్కనపెట్టి, తప్పు తెలుసుకుని కేంద్రం మీద ఫైట్ చేస్తోన్న తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించడం పవన్ అపరిపక్వతను సూచిస్తోంది.

నేడు పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగంపై అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. నిండు సభలో “మోడీ అండ్ కో”ను కడిగిపారేసిన గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం పవన్ దృష్టిలో వ్యర్ధమైన ప్రసంగం అయ్యిందంటే… ఏ స్థాయిలో పవన్ రాజకీయ పరిణితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. విమర్శించాల్సిన అంశాలలో విమర్శించవచ్చు, తప్పులేదు, కానీ కేంద్రాన్ని ఒత్తిడి తెస్తున్న సమయంలోనే సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వంపై మరింతగా పవన్ చెలరేగడం ఎలాంటి సంకేతాలను ప్రజలకు పంపిస్తున్నారో ఆయనకైనా అర్ధం అవుతోందా?!

‘నరం లేని నాలుక ఎలా పడితే అలా మాట్లాడుతుందని’ చెప్పడానికి కూడా నిదర్శనంగా పవన్ వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. నాడు పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు ప్రశ్నించలేదని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదని చెప్పుకొచ్చిన పవన్, ఇప్పుడు అదే ఎంపీలు తీవ్రస్థాయిలో పోరాటం చేస్తుంటే, వారిని చులకన చేసే భావన పవన్ లో కలిగిందంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ ఏ విధంగా పాటు పడుతున్నారో అవగతం అవుతుంది. ముఖ్యంగా ఇప్పటికీ బిజెపిని కాకుండా రాష్ట్రాన్ని విమర్శించడం పవన్ చేస్తున్న సరికొత్త రాజకీయం అనుకోవాలేమో!? హతవిధీ!!