Pawan Kalyan Jana Sainiks doubt on bjpమొన్నటివరకు జనసేన పై అధికారం చెలాయించాలని చూసిన బీజేపీ ఆ తరువాత తిరుపతిలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గ ఓట్లు కోసం పవన్ కళ్యాణ్ నామ స్మరణ చెయ్యడం మొదలుపెట్టింది. ఇప్పుడు అంతా బానే ఉంది గానీ తిరుపతి ఉపఎన్నిక తరువాత తమ నిజస్వరూపం చూపిస్తారా అనే అనుమానం జనసైనికులలో ఉంది.

అయితే అప్పటిదాకా ఆగకుండానే రంగు మార్చింది బీజేపీ. నిన్న ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ… తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించలేదని… అది మీడియాలో ఎలా వచ్చిందో తనకు తెలీదని చెప్పుకొచ్చి జనసైనికులను రెచ్చగొట్టారు.

సరిగ్గా పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనకు ఒక రోజు ముందు ఈ వ్యాఖ్యలు చేసి ఆయనను అవమానించడం గమనార్హం. ఇది పెద్ద ఎత్తున చర్చకు తెరలేపగా ఈరోజు మరో వివరణ నష్టనివారణగా ఇచ్చుకున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య జనసేన ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడటం ఇప్పుడు అనుమానంగా మారింది.

“తమ కుటుంబాల కోసం నడిపే టిడిపి-వైసీపీల అవినీతి,అరాచక పరిపాలనకు విసిగిపోయిన ఆంధ్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను,” అని ఆమె ట్వీట్ చేశారు. అయితే చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం?