Pawan Kalyan Jana Sainiksబీజేపీ.. జనసేన పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ తమ పార్టీకి జనసేనతో ఎటువంటి పొత్తు లేదని , ఉండబోదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కేవలం మోడీ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై తమకు మద్దతు ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.

దీనిపై సోషల్ మీడియాలో జనసైనికులు భగ్గుమంటున్నారు. “జనసేన బీజేపీ పొత్తు ఉంటే రెండు రాష్ట్రాలలో ఉండాలి లేకపోతే రెండు చోట్లా వద్దు. కేవలం ఏపీ బీజేపీ కి బూస్ట్ ఇవ్వడానికి పవన్ కేవలం ఏపీ లోనే పొత్తు పెట్టుకుంటా అంటే కుదరదు. పొత్తు అనేది ఇరుపక్షాలకు మేలు చేసేదిగా ఉండాలి, బీజేపీ మేలు కోసం మాత్రమే జనసేన పని చెయ్యదు,” అని వారు అంటున్నారు.

చాలా మంది బీజేపీతో పొత్తు వద్దని…ఈ అవమానాలు ఇక వద్దని… తెగతెంపులు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కు ట్వీట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జనసైనికులలో ఇంకో వర్గం మాత్రం బీజేపీ తో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. “కష్టమో నష్టమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఇలా పొత్తులు మారుస్తూ పోతే ప్రజలలో క్రెడిబిలిటీ ఉండదు. మాట్లాడుకుని భేదాభిప్రాయాలు సరి చేసుకోవాలి,” అని వారు అంటున్నారు.

అయితే ఇరువైపుల వారు చెప్పేదాంట్లో కొంత పస ఉంది. జీహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ నుండి తప్పుకుని పవన్ కళ్యాణ్ భేషరతు గా మద్దతు ఇవ్వడం తో కమలనాథులు జనసేనను కొంత లోకువ కట్టారు. పొత్తు రెండు చోట్లా ఉండాలని గట్టిగా పవన్ చెప్పగలరా అనేది చూడాలి.