Pawan Kalyan -Jagat Prakash Naddaమూడు రోజులు ఢిల్లీ లో మకాం వేసి ఎట్టకేలకు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అప్పోయింట్మెంట్ సాధించి ఆయనతో కాసేపు మాట్లాడి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వచ్చామని, ఉపఎన్నిక గురించి కాదని… నడ్డాతో అమరావతి, ఆలయాల మీద దాడులు, పోలవరం తదితర విషయాల గురించి చర్చించామని చెప్పుకొచ్చారు పవన్.

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ తరఫున ఉండాలనే అంశంపై ప్రాథమికంగా చర్చించామని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. దీనిపై ఒక కమిటీ నియమించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నడ్డా హామీ ఇచ్చారని వెల్లడించారు.

తిరుపతి సీటు గురించే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు అనేది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ నాయకులకు రాజకీయ ఎజెండా ఉండడం తప్పేమీ కాదు. నాయకులు అసలు తమ రాజకీయ అవసరాలు పట్టించుకోకూడదు అని ప్రజలు కూడా అనుకోరు.

అటువంటి సందర్భంలో తిరుపతి ఉపఎన్నిక కోసమే ఢిల్లీ వెళ్లినా ఆ మాట చెప్పకుండా… మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటానికి వెళ్ళాం అని చెప్పుకోవడం ఎందుకు? అటువంటి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు… ఎదురు అభాసుపాలు అవుతారు. కావున ఇటువంటి విషయాలలో కొంచెం నిజాయితీగా మాట్లాడితేనే మంచిది.