Chandrababu -naiduఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు కధనరంగంలోకి దూకి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తమ విమర్శల జడివానలో తెలుగుదేశం పార్టీని తడిపేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు దీనిని నుండి ఎలా బయటపడతారా? అనేది ఆశ్చర్యకరం. గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఒక్క శత్రువు వైఎస్సాఆర్ కాంగ్రెస్ తోనే పోరాడింది. అయితే ఈ సారి ఐదుగురు శత్రువులు అన్ని వైపుల నుండి చంద్రబాబును చుట్టుముట్టారు.

జగన్ మోహన్ రెడ్డితో పాటు గత ఎన్నికలలో చంద్రబాబుకు సాయం చేసిన పవన్ కళ్యాణ్ కూడా జతకలిశారు. గోదావరి జిల్లాలోని బలమైన కాపు సామాజిక వర్గాన్ని టీడీపీకి దూరం చెయ్యడమే ధ్యేయంగా ఆయన పని చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేకపోయినా కేంద్రం సాయంతో కీలక తెలుగు దేశం నేతలపై ఐటీ, ఈడీ దాడులతో చంద్రబాబుకు ఊపిరి సలపకుండా చేస్తుంది కాషాయ పార్టీ. లగడపాటి వంటి వారి మాటలతో కాంగ్రెస్ కు తెలంగాణాలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావించి తెలంగాణ ఎన్నికలలో ఓవర్ గా ఇన్వాల్వ్ అయ్యారు చంద్రబాబు.

ఫలితాలు వచ్చాక చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు తాము ఏపీ రాజకీయాలలో వేలు పెడతామని చంద్రబాబుని ఓడించడమే ధ్యేయంగా పని చేస్తామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణాలో మాకు గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని చెప్పుకొచ్చారు ఆయన. ఇదే క్రమంలో ‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తావా? ఏపీకి వస్తా.. టీడీపీకి వ్యతిరేకంగా, మిత్రుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తా. మా తడాఖా ఏమిటో చూపిస్తా.’’ అని చంద్రబాబును హెచ్చరించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి.

ఆయన ప్రచారం చేస్తే ముస్లింల ఓట్లు వైకాపాకు గంపగుత్తుగా పడతాయని ఆయన అంచనా. తెరాస ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి డైరెక్టుగా ఎంటర్ అవుతుందా లేక తెర చాటుగా ఉండి ఏదో ఒక ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు ఇబ్బంది పడతారా లేక ఇంత మంది ఒక్కడి మీద పడుతున్నారని జాలితో ప్రజలు ఆయనను గెలిపిస్తారా చూడాలి. అదే క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకి మేలు చేస్తుందా అనేది కూడా చూడాలి.