Pawan Kalyan 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… “ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చాలా కీలకంగా భావించానని, అయితే మంచి నాయకుడ్ని ఎన్నుకున్నారని, అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం పని చేయాలని, ఎటువంటి సమయంలోనైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించకుండా ఉండలేనని, ఇక తన పని తానూ చూసుకుంటానని, ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి రాజకీయాల వైపుకు చూస్తానని, అది కూడా ప్రభుత్వ పని తీరు సరిగా లేకుంటేనే రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే తన సినిమాలు తానూ చేసుకుంటూ ఉంటానని” తెలిపారు.

దాదాపు ఈ సంగతులన్నీ చెప్పి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. తాజాగా తన మనోభావాలు తెలిపిన పవన్ కళ్యాణ్… సినిమా రంగాన్ని త్వరలోనే వదిలేసి పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని… ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోతేనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెప్పిన పవన్, 2018లో ఖచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ పాలన, చంద్రబాబు హయం పవన్ కు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.

ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచనలు, భావాలు ఉంటాయి గనుక చంద్రబాబు పాలనపై బహుశా పవన్ కు అసంతృప్తి ఉండొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండడానికి స్థానిక సర్కార్ ఎంత కారణమో, కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కూడా అంతే కారణం. ఖజానా ఖాళీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. మరి ఆ విషయంలో మోడీ సర్కార్ ఏ విధమైన వైఖరిని అవలంబిస్తుందో అందరికీ తెలిసిందే. అలాంటి బిజెపిపై విమర్శలు కురిపించకుండా… ‘జనసేన’ను ప్రజల్లోకి తీసుకెళ్లగలరా? తీసుకెళ్ళినా ప్రజల మద్దతు కూడగట్టగలరా? ఇలాంటి అనేక ప్రశ్నలు ‘జనసేన’ అధినేతకు ఘనస్వాగతం పలుకుతున్నాయి.