Pawan-Kalyan-Finally-Breaks-Suspense-on-Amaravati-Issueసమకాలీన రాజకీయ విషయాల పై తన స్పందనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక వీడియో ఇంటర్వ్యూ ద్వారా తెలుపుతున్న విషయం తెలిసిందే. కాసేపటి క్రితం రెండో విడుత ఇంటర్వ్యూలో మరికొన్ని అంశాలపై మాట్లాడారు. దానిలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీద పెదవి విరిచారు జనసేనాని.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారన్నారు. ఆ పార్టీకి ఉన్న బలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాలకే పని చేసి, ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సిఎం జగన్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “సుమారు 60 కేసుల్లో ఓడిపోయింది. ఆ తప్పులను సరిచేసుకుని, ప్రభుత్వం ప్రజలకు సరైన జీవన విధానం ఇవ్వాలి. గత ప్రభుత్వంలో ఉన్న తప్పులను ఈ ప్రభుత్వం సరిచేసే అవకాశం ఉన్నా.. ఆ ప్రయత్నం చెయ్యడం లేదు,” అని పవన్ అన్నారు.

అలాగే ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు చూడకుండా అప్పులు తెచ్చే మార్గాలు చూస్తోందన్నారు. దీనివల్ల ప్రభుత్వం నడిపే వ్యక్తులకు ఏంకాదన్నారు. “అలా చేస్తే అది అభివృద్ధి కాదు…. తిరోగమనం అవుతుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని ఇకనైనా వారు తమ పంథా మార్చుకోవాలి,” అని ఆయన అభిప్రాయపడ్డారు.