pawan kalyan instabilityకర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా నగరంలోని సీక్యాంపు నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్‌షో నిర్వహించారు. దీనికి భారీగా జనాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని చేసిన ఒక వ్యాఖ్య ఆశ్చర్యకరంగా ఉంది. “ఓట్ల కోసం జగన్‌, చంద్రబాబుల మాదిరి అబద్ధపు హామీలనిచ్చి మోసం చేయబోను. మీకు అండగా నడుస్తా. రాత్రికి రాత్రి గొప్ప మార్పు తెస్తామని చెప్పడం లేదు. నిలకడగా.. బలంగా రాణిస్తా,” అన్నారు అంత వరకూ బానే ఉంది.

“ఒక వ్యక్తికి పరిపాలన ఇస్తే పెద్ద స్థాయి నుంచి దిగువ వరకు అస్తవ్యస్తమవుతుంది. అందరం సంకీర్ణ ప్రభుత్వాలవైపే దృష్టి పెడదాం,” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తా అని స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా సంకీర్ణ ప్రభుత్వాల వైపు దృష్టి పెట్టడమంటే ఎన్నికల తరువాత ఏదో ఒక పార్టీతో కలుస్తారు అనేగా అర్ధం. దీని బట్టి పవన్ కళ్యాణ్ కు కొందరు వేరే పార్టీలతో చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించే అవకాశం ఉంది.

అదే క్రమంలో జనసేనకు సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వారే ఒప్పుకున్నట్టు అయ్యింది. గతంలో కర్ణాటక ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ కుమారస్వామిలాగా అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని వార్తలు వచ్చేవి. బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా దానికే అర్ధం పట్టేలా ఉన్నాయి. ఎన్నికల ముందు ఒక ప్రధానమైన పార్టీ సంకీర్ణం గురించి మాట్లాడటం అంటే అది ఆత్మహత్యసదృశ్యమే అవుతుంది. అది ఎంత త్వరగా తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ కు అంత మంచిది.