pawan kalyan have to change his style“భీమ్లా నాయక్” ధియేటిరికల్ ట్రైలర్ రిలీజ్ తో ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానుల హంగామా అంతా ట్రైలర్ పైకి మళ్లింది. నిజానికి ఈ ట్రైలర్ వారికి నచ్చిందో లేదో పక్కన పెడితే, యూట్యూబ్ రికార్డులను కైవసం చేసుకునే లెక్కల పనిలో పడ్డారు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రికార్డుల చెంతకు అయితే చేరే అవకాశం లేదు గానీ, ఆ తర్వాత స్థానంలో ‘భీమ్లా నాయక్’ను నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, హార్డ్ కోర్ పవన్ అభిమానులకు తప్ప ఈ ట్రైలర్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఏ విభాగంలో కూడా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచలేకపోయింది. త్రివిక్రమ్ డైలాగ్స్ మొదలుకుని, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు ‘భీమ్లా నాయక్’పై ప్రస్తుతం ఉన్న అంచనాలను కూడా క్రిందికి లాగే విధంగా చేసింది. బహుశా ఇది కూడా సినిమా ప్రమోషన్ లో భాగమేమో చూడాలి.

ఎందుకంటే ‘పుష్ప’ ట్రైలర్ కట్ కూడా నిరాశాజనకంగా ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద బొమ్మ అదిరిపోయే వసూళ్లను సొంతం చేసుకుంది. గతంలో ‘ఫిదా’ సినిమా కూడా ఇంతే! ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షించలేనంత మాత్రాన సినిమా బోర్లా పడుతుందని చెప్పలేం గానీ, అంచనాలను తగ్గించేందుకు చిత్ర యూనిట్ ఈ రకమైన ట్రైలర్ ను కట్ చేసారేమో అనిపించకమానదు.

ట్రైలర్ లో హీరోయిజమ్ ఎలివేట్ చేసే సన్నివేశాలను పెద్దగా కట్ చేయకపోవడంతో, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఆస్కారం లేకుండా పోయింది. ధియేటర్ లో అయితే మోత మోగిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే ట్రైలర్ లో పవన్ కంటే ఎక్కువగా రానా హైలైట్ అయ్యారు. ఒక్క నిత్యామీనన్ డైలాగ్ లో తప్ప మిగతా ఎక్కడా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ మచ్చుకైనా కానరాలేదు.

ఇక హీరో పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ లుక్స్ కొన్ని చోట్ల ఆకట్టుకునే విధంగా, మరికొన్ని చోట్ల ఫ్యాన్స్ చేతే పెదవి విరిచే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండు, మూడు హెయిర్ స్టైల్స్ పెట్టి పవన్ ను సరిగా చూపించలేదన్న టాక్ వచ్చింది. 25వ తేదీన బొమ్మ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకున్నా, పవన్ తన తీరును అయితే మార్చుకోవాలి అన్న ఖచ్చితమైన అభిప్రాయాన్ని ”భీమ్లా నాయక్” ట్రైలర్ కలిగించింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక హీరోనే కాదు. ‘జనసేన’ అనే రాజకీయ పార్టీకి వ్యవస్థాపకుడు. చేతిలో ఉన్న సినిమా అనే ఆయుధం ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను గానీ, సమాజం పట్ల తనకున్న అభిప్రాయాలను గానీ తెలియజేసే మహత్తరమైన అవకాశాలను, రీమేక్ సబ్జెక్టులు, కమర్షియల్ సబ్జెక్టులు ఎంచుకుని చెడకొట్టుకుంటున్నారనే టాక్ ఊపందుకుంది.

ఓ పక్కన టాలీవుడ్ టాప్ హీరోలు ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, మహర్షి’ వంటి సామాజిక అంశాలతో మంచి కధలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తుంటే, పవన్ ఏమో ఫక్తు కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. అందులోనూ అవి రీమేక్ కధలు కావడం మరింత శోచనీయం.

నిజంగా ఓ ‘మహర్షి’ లాంటి కధ పవన్ కళ్యాణ్ చేతిలో పడితే, కమర్షియల్ సక్సెస్ మాట పక్కన పెడితే, వ్యవసాయం మీద పవన్ ఇచ్చే లెక్చర్ కేవలం సినిమా పరంగానే కాక, రాజకీయ పరంగా కూడా తనకున్న భావజాలాన్ని తెలియజేసే అవకాశం చేతికి చిక్కినట్లవుతుంది. సినిమా అనే ఒక గొప్ప ఆయుధాన్ని తన చేతిలో ఉంచుకుని, పవన్ ఎందుకు తనకు అనుకూలంగా మలచుకోలేకపోతున్నారు? అంటే… దానికి కారణం ఒకటే ఒక్కటి.

కెరీర్ తొలినాళ్ళ నుండి కూడా ఇండస్ట్రీలో పవన్ పై ఉన్న ఒక ప్రధాన ఆరోపణ “దర్శకుల పనిలో జోక్యం చేసుకుంటారు” అని. దీని వలనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లతో పవన్ పని చేయలేకపోతున్నారు అనే టాక్ ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉంది. అందుకే మరుగున పడిపోయిన దర్శకులు, ప్రేక్షకులకు సరిగా తెలియని దర్శకులతో పవన్ పని చేయడం వలనే సామాజిక అంశాలతో కూడిన నాణ్యమైన కధలను చేయలేకపోతున్నారన్న విమర్శలు వెలువడుతున్నాయి.

ఇందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కన పెడితే, స్టోరీ సెలక్షన్ – దర్శకుల ఎంపికలలో పవన్ కళ్యాణ్ తీరు అయితే ఖచ్చితంగా మారాల్సిన ఆవశ్యకత కనపడుతోంది. ఇది ఒక్క సిల్వర్ స్క్రీన్ పైన స్టార్ స్టేటస్ ను మరింత పెంపొందించడానికే కాదు, ‘జనసేన’ మరింతగా విస్తరించడానికి, ప్రజలకు తాను మరింతగా చేరువ కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ దిశగా అడుగులు వేయకపోతే, పవన్ ఎన్ని సినిమాలు చేసినా, ‘జనసేన’కు ఒరిగే ప్రయోజనం శూన్యం.

ఒక ‘శ్రీమంతుడు’ లాంటి సబ్జెక్టుతో హిట్టు కొట్టి ప్రజల్లోకి వస్తే ఉండే ఊపుకు, ‘అజ్ఞాతవాసి’ లేక కమర్షియల్ ‘భీమ్లా నాయక్’ లాంటి సినిమాలు తీసి ప్రజల చెంతకు చేరితే కలిగే అనుభూతికి తేడా ఉంటుందన్న విషయం స్వయంగా పవన్ కళ్యాణ్ గమనించుకుంటేనే ఆ మార్పు సాధ్యం. ఎందుకంటే ప్రస్తుతం అటు రాజకీయ పరంగా, ఇటు సినిమాల పరంగా పవన్ వేస్తోన్న అడుగులన్నీ విమర్శలకు తావిస్తున్నవే.