Pawan Kalyan going reverse to YS jaganతనకు అధికారమే వద్దని ప్రకటనలు చేసిన ‘జనసేన’ అధినేత స్వరంలో ఇటీవల స్పష్టమైన మార్పు సంభవించింది. బహుశా శ్రీరెడ్డి ఉదంతంతో కళ్ళు తెరుచుకున్నారో లేక కేంద్ర పెద్దలు ఈ విధంగా నడిపిస్తున్నారని భావించాలో గానీ… ప్రస్తుతం పవన్ నోట “అధికారం” కావాలన్నా మాటలు వస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ వచ్చే ఏడాదిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కుండబద్దలు కొడుతూ చెప్తున్నారు. ఇది కేవలం ఆకాంక్షగా పవన్ చెప్తోన్నది కాదు, వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని జగన్ మాదిరే బల్లగుద్ది చెప్తున్నారు. అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పోటీగా మరొకరు సిఎం కావాలని కూర్చున్నారన్న మాట.

దీంతో పవన్ కూడా కాస్త అటు ఇటుగా జగన్ మార్గంలోనే పయనిస్తున్నాడన్న సంకేతాలు కనపడుతున్నాయి. మరి వీరిద్దరూ ఒకే మార్గంలో పయనించడం వెనుక సంకేతాలు ఏంటి? టిడిపి ఆరోపిస్తున్నట్లు వీరి వెనుక బిజెపి ఉండి, ఇద్దరినీ ఒకే విధంగా నడిపిస్తోందా? అన్న సందేహాలు వ్యక్తం కావడం మానవ సహజం. ఇవన్నీ పక్కన పెడితే, అసలు మొన్నటివరకు అధికారమే వద్దన్న పవన్ లో ఎందుకు అధికారం కావాలన్న కోరిక కలిగింది అన్నది ప్రశ్నార్ధకం. బహుశా నేడు ప్రసంగించబోయే బహిరంగ సభలో దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి. అధికారం పవన్ కు చిత్తశుద్ధిగా లభించాలి అంటే, అధికారంలో ఉన్న టిడిపిని ఎండగట్టడం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వైఫల్యాలను కూడా ఎత్తిచూపడం అంతే ముఖ్యం.

మరి అంత ధైర్యం పవన్ కళ్యాణ్ చేస్తారా? మొన్న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ విషయాన్ని ప్రస్తావించే సమయంలో ‘చేతులు కట్టుకుంటూ తన బాడీ లాంగ్వేజ్’ను పూర్తిగా మార్చేసిన పవన్, ప్రస్తుతం టిడిపిపై చేస్తోన్న విమర్శల మాదిరే జగన్ పై కూడా చేయగలరా? పవన్ కు అధికారం కావాలి అంటే తప్పకుండా చేయాల్సిందే! అలా కాదు, విమర్శలు చేయకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అంటే… అందులో ఆంతర్యం ఏమిటో రాజకీయ విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతా “భారతీయ జనతా”లో ఉన్న ‘ప్రజాస్వామ్య’ సౌలభ్యం అనుకోవాలి. అధికారం కోసం పవన్ ప్రాకులడుతుండడం ఏపీ రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో వేచిచూడాలి.