pawan-kalyan-gabbar-singh-in-ekkadiki-pothavu-chinnavadaప్రస్తుత సినిమాల్లో అగ్ర హీరోలను ఎలా వాడుతున్నారో తెలిసిందే. ముఖ్యంగా పవన్ విషయంలో ఈ వాడుక ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా! నేడు విడుదలైన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ను ఒక రేంజ్ లో వాడారు. అయితే కొంతలో కొంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే… సన్నివేశాలకు తగ్గట్లుగా పవర్ స్టార్ ను వాడడంతో సిల్వర్ స్క్రీన్ పై సీన్లు పండాయి.

ముఖ్యంగా దెయ్యంగా మారిన హీరోయిన్ టీవీలో ‘గబ్బర్ సింగ్’ పాట వచ్చిన సమయంలో విజిల్స్ వేసి, డాన్స్ లు చేయడంతో ‘దెయ్యాలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా?’ అన్న కమెడియన్ డైలాగ్ ధియేటర్ లో నవ్వులు పంచాయి. అలాగే హీరోయిన్ అవికా ‘రౌడీయిజం పుట్టిందే మా బెజవాడలో’ అంటూ పవన్ మెడ పైన చేయి వేసే సీన్ ను ఇమిటేట్ చేయగా, ఇదే సీన్ ను వివిధ సందర్భాలలో దర్శకుడు తన సన్నివేశాలకు అనుగుణంగా వినియోగించుకున్నాడు.

ఇక, ఈ సినిమా హీరో నిఖిల్ తొలి సాంగ్ లోనే ‘గబ్బర్ సింగ్’ సినిమా పోస్టర్లు, ‘గబ్బర్ సింగ్’ మాదిరి పంచెకట్టు అలరించాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే మరో సాంగ్ లో ఏకంగా పవన్ పేరును వాడుకున్నాడు దర్శకుడు. మొత్తం మీద ‘పవర్’ను ‘ఫుల్లు’గా వాడేయడంలో దర్శకుడు విఐ ఆనంద్ సక్సెస్ సాధించినట్లుగా ఉంది. అయితే ఇవేమీ తెరపై ఎబ్బెట్టు కలిగే విధంగా లేకపోవడం ప్రేక్షకులకు ఉపశమనం. ఈ వాడుకలో కాస్త అటు ఇటు అయ్యుంటే, ‘పవన్ భజన’ కోసం సినిమా తీసినట్లుగా అయ్యుండేది.