Pawan Kalyan free gas connection not possibleజనసేన తన మేనిఫెస్టో కంటే ముందుగా ఇప్పటికే కొన్ని తాయిలాలు ఇచ్చింది. ఇప్పటిదాకా అమలులో ఉన్న ఉచిత గ్యాస్ కనెక్షన్లను, సబ్సిడీ ధరలకు గ్యాస్ సీలిండర్లు కాకుండా ఏకంగా ఆడపడుచులకు అర్హత మేర ఉచ్ఛిత గ్యాస్ సీలిండర్లు ఇస్తాం అని ఆ పార్టీ ప్రకటించింది. అర్హత మేర అంటే బహుశా ఆర్ధిక పరిస్థితి బట్టి అని ఏవో కండిషన్లు పెట్టవచ్చు. దానిపై ఎన్నికలలో గెల్చి ఆ హామీని అమలు పరిస్తే గానీ స్పష్టత రాదు. సహజంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఆ కండిషన్లు ముందుగా చెప్పదు.

అయితే ఈ పథకాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. కేజీ బేసిన్‌లో ఎంతో గ్యాస్‌ ఉందని, అందకుకే తాము ఉచిత గ్యాస్‌ ప్రకటించామని, ఆ గ్యాసు అంతటిని ఇప్పుడు గుజరాత్ తరలించుకుపోతున్నారని వారిని చొక్కా పట్టుకుని తెచ్చి ఆడపడుచులకు ఉచితంగా ఇస్తామని జనసేనాని ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆయన ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. లాజిక్ అనే కంటే ఒక సబ్జెక్టు మిస్ అయ్యారు.

దేశం మొత్తం మీద ఎక్కడ గ్యాస్ నిక్షేపాలు దొరికినా వాటి మీద పూర్తి హక్కులు కేంద్రానివే. ముఖ్యంగా తీరం వెంబడి ఉండే గ్యాస్ నిక్షేపాలు. ప్రైవేట్ ఆస్తులలో దొరికితే సదరు యజమానికి కొంత పరిహారం ఇస్తారు. రాష్ట్రాలకు వాటి మీద ఎలాంటి హక్కు లేదని రాజ్యాంగం చెబుతుంది. గతంలో కోర్టులు కూడా అదే మాట చెప్పాయి. కనీసం ఎక్కడైతే దొరికాయో ఆ రాష్ట్రాలకు కొంత రాయల్టీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి కేజీ బేసిన్‌లో గ్యాస్ తో ఇక్కడ ఆడపడుచులకు ఉచ్ఛిత గ్యాస్ ఇవ్వడం సాధ్యం కాదు. బహుశా కేంద్రంతో పోరాడి రాజ్యాంగాన్ని పవన్ కళ్యాణ్ ఎమన్నా మార్చగల్గితే మాత్రం అది వేరే సంగతి.