Pawan Kalyan Fires on YS Jagan over attacks on condidatesస్థానిక సంస్థల ఎన్నికలకు గానూ బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేశాయి. ఈ సంధర్భంగా.. ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని.. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నామినేషన్లు వేసిన వాళ్లు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దెబ్బలు తిన్నా … బలంగా నిలబడండన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల నామినేషన్లు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులు నామినేషన్లు వేయలేని విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు అనగానే ప్రజలు భయానికి గురయ్యే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

దౌర్జన్యాలకు పాల్పడితే ఎన్నికలు నిర్వహించడం ఎందుకని పవన్ ప్రశ్నించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పవన్ చెప్పారు. ఈ విషయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని కూడా పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు.

ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించినట్లయితే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా అనిపించవచ్చు కానీ భయపెట్టి సాధించిన గెలుపు ఎన్నటికీ నిలబడదని ఆయన అధికార పక్షానికి హితవు పలికారు. వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఈరోజు ప్రజలు కదిలిరావలసిన రోజన్నారు.