Pawan Kalyan fires on ys jagan governmentవిశాఖ పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ తీరును ప్రజల సమక్షంలో ఏకిపారేశారు. స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే వైసీపీ నేతలు పచ్చి బూతులు తిడతారని, కానీ జనసేన మాత్రం వైసీపీ పాలసీల మీద వ్యతిరేకిస్తాం గానీ, వ్యక్తిగత దూషణలకు విరుద్ధమని వైసీపీ నేతల తీరుపై విమర్శలు చేసారు.

అమరావతి రాజధానిగా ఉండాలనే నియమంతోనే గతంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని, ఇటీవల తిరుపతిలో అమిత్ షా కూడా దీనిని ధృవీకరించారని, వైసీపీ మాత్రం మూడు రాజధానులంటూ ప్రతిపక్షంలో ఓ మాట, అధికారంలోకి వచ్చాక ఇంకొక మాట చెప్పారని, విలువలు లేని వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు.

ఒక్క ఎమ్మెల్యేని గెలిపించిన నాకు కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇస్తున్నప్పుడు, 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి మీరేం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగడంలో ఉంది తప్పు! ఎన్నికలు ఉన్నపుడు స్టీల్ ప్లాంట్ అంటూ హడావుడి చేసి, ఎన్నికలు ముగియగానే మరిచిపోయారంటూ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎత్తి చూపారు.

వ్యక్తిగతంగా తనను కేంద్ర ప్రభుత్వ అధినాయకత్వం ఇష్టపడొచ్చు గానీ, 22 మంది ఎంపీల మాట ఒక శాసనం అని, ప్రజాక్షేత్రంలో తాను బలవంతుడినని, సభలు పెడితే ప్రజలు చాలా మంది వస్తారు గానీ, చట్టసభలలో తాను బలహీనుడినని, ఒకవేళ వైసీపీ స్థాయే నాకు ఉంటే ఇలా చేతకానితనంగా కూర్చునేవాడిని కాదంటూ జగన్ సర్కార్ ను ఎండకట్టారు.

చేతకాని వ్యక్తులు చట్టసభలలో కూర్చుని ప్రయోజనం దేనికని, పార్లమెంట్ సమావేశాలు ఇంకా వారం రోజులు సమావేశాలు జరగబోతున్నాయని, వైసీపీ ఎంపీలకు నిజంగా చిత్తశుద్ధిని ఉంటే, పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ కు అనుగుణంగా ఒక ప్లే కార్డు అయినా పట్టుకోగలరా? అంత దమ్ము ఉందా మీకు? అంటూ వైసీపీ నేతలను నిలదీశారు.

ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న తెలుగుదేశం పార్టీ పైనే రౌడీయిజం చేస్తే నోరెత్తలేని పరిస్థితి అని, వైసీపీ నేతల చొక్కా పట్టుకుని నిలదీయకపోతే పనవ్వదని, 2024 వరకు వాళ్ళ రౌడీయిజం భరించాలి, వాళ్ళ గుండాయిజం భరించాలి, వాళ్ళ బూతులు భరించాలి, 2024 తర్వాత అప్పుడు మనం చెపుదాం, ఇందు నిమిత్తం ఓటును సరిగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

తాను ఒక్కడినే గెలవడానికి పార్టీ పెట్టలేదని, 25 ఏళ్ళ తరం గెలవాలని పార్టీ పెట్టానని, తన కోసమే అయితే ఏదొక పార్టీలో చేరితే ఇప్పటికే కేంద్రమంత్రి పదవి వచ్చేదని, ప్రజలు జనసేనకు అండగా ఉంటే, ఒక ఎంపీ, ఎమ్మెల్యే రాష్ట్రానికి ఎంత చేయగలరో తాము చేసి చూపిస్తామని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను సరైన రీతిలో అమలు చేస్తామని అన్నారు.

ఒకప్పుడు యూపీ, బీహార్ లలో లా అండ్ ఆర్డర్ అధ్వానంగా ఉండేదని, ఇపుడు ఏపీ అంతకు మించి దిగజారిపోయిందని, ఎమ్మెల్యేలే రౌడీయిజం చేసే స్థాయికి వెళ్లిపోయారని, చట్టసభలలో మీ మాటే శాసనం, అలాంటి చట్టసభలలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, భార్యను బూతులే తిడుతుంటే, రోడ్డు మీద తిరిగే ఆడబిడ్డలకు ఏం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.

ఫైనల్ గా “వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరం” అన్న సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ‘జనసేన’ అధినేత. వైసీపీ అనారోగ్యం ఇస్తోందని, జనసేన ఆరోగ్యం ఇస్తుందని, కార్మికులకు జనసేన అండగా ఉంటుందని, 2024లో జనసేన అధికారంలోకి రావడానికి మీరు మద్దతు తెలపాలంటూ ముగించారు పవన్ కళ్యాణ్.