Pawan Kalyan - Feeling lonelyజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? ఆయన మాటలు బట్టి అలాగే అనిపిస్తుంది. తెలంగాణలో 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఒక్క మాటతో తీసేస్తే అన్నిపార్టీలు కలసి వచ్చాయి.. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని లక్షల మంది రోడ్డునపడితే ఇక్కడ రాజకీయ వ్యవస్థకి పౌరుషం లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

మన వ్యవస్థ గ్రూపులుగా, వర్గాలుగా విడిపోయి ఉండడమే అందుకు కారణమన్నారు. అయితే ఎవరు వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ మాత్రం ఎవరికి సమస్య వచ్చినా త్రికరణశుద్దిగా అండగా నిలబడుతుందని తెలిపారు. బహుశా పవన్ కళ్యాణ్ తనకు ఇతర ప్రతిపక్షాల నుండి సరైన మద్దతు ఉండటం లేదని భావిస్తున్నట్టున్నారు.

అయితే పవన్ ఒక విషయం ఆలోచించుకోవాలి. ఈ నెల ముందున ప్రధాన ప్రతిపక్ష పార్టీ, తెలుగుదేశం ఈరోజున ఇసుక కొరతకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామని ప్రకటించింది. ప్రతిపక్షాల ఐక్యత అని పెద్ద పెద్ద మాటలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ఈ నిరసనలకు తమ పార్టీ మద్దతు ఇవ్వాల్సింది.

కానీ అలా చెయ్యకుండా వచ్చే నెల 3న విశాఖపట్నంలో జనసేన తరపున ఇదే అంశంపై నిరసన కవాతు ప్రకటించారు. గత ఎన్నికలలో కలిసిన పోటీ చేసిన వామపక్ష పార్టీలను కూడా జనసేన దూరం పెడుతుంది. వారితో కలిసి పని చేస్తారో లేదో కూడా తెలీదు. మరి ప్రతిపక్షాల ఐక్యత కావాలి అనుకోవడం ఎలా?