pawan-kalyan-fansపవన్ కళ్యాణ్ ఈ పేరు వినపడినా… కనపడినా… ఆనందంతో కానీ, ఆవేశoతో గానీ ఊగిపోయే అభిమానులు కోకొల్లలు. పవన్ కు అనుకూలంగా ఏదైనా విషయం వచ్చిందంటే ఆనందంతోనూ… ప్రతికూలంగా ఉందంటే ఆవేశంతోనూ అభిమానులు వారి వారి భావోద్వేగాలు వ్యక్తపరుస్తుంటారు. అయితే పవన్ అభిమానులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే…. “భజన చేసే వాళ్ళందరూ భక్తులు కాదు…. దండం పెట్టని వారంతా దెయ్యాలు కాదు.”

పవన్ కళ్యాణ్ ను సినీ రంగానికి చెందిన ఓ నటుడు కన్నా, పవన్ వ్యక్తిత్వం రీత్యా రాజకీయ రంగంలో అభిమానించే వారి శాతమే ఎక్కువన్న విషయం బహిరంగమే. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పేరు కేంద్రంగా జరుగుతున్న ఇటీవల పరిణామాలు ఆయనను కొన్ని వర్గాల వారికి దూరం చేసేదిగా ఉందన్న సత్యాన్ని పవన్ అభిమానులు గ్రహించాలి. ‘తాము పవన్ కళ్యాణ్ భక్తులము’ అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న అభిమానగణం, ఒక్క క్షణం విజ్ఞతతో ఆలోచించుకుంటే విషయం వారికే బోధపడుతుంది.

తనపై విమర్శలు చేసేవారిపై పవన్ కళ్యాణే పెద్దగా స్పందిచరు. అందరి విమర్శలపై స్పందించడం వలన తన స్థాయిని తానే తగ్గించుకున్న వాడినవుతాననేది పవన్ ఉద్దేశం కావచ్చు. అయినా ప్రత్యర్ధుల విమర్శలకు ఒకే ఒక్క మాటతో సమాధానం చెప్పగల సత్తా పవన్ కళ్యాణ్ సొంతమని చాలా సందర్భాలలో నిరూపించుకున్నారు కూడా! ఉదాహరణకు పవన్ వ్యక్తిగత విషయమైనా మూడు పెళ్ళిళ్ళ విషయంలో రాహుల్ గాంధీకి మూడు ముక్కలలో సమాధానం చెప్పి మళ్ళి మూడో మనిషి మాట్లాడకుండా నోరు మూయించగల శైలి పవన్ సొంతం.

అలాగే వర్మ తనపై చేసిన ట్వీట్లపై ఒకే ఒక్కసారి స్పందించి, ఆయన నోటికి కొంత కాలం మూత వేయగలిగారు. అదే విధంగా మాటల యుద్ధంలో అగ్రస్థానంలో ఉండే రోజాకు నోరు అదుపులో ఉంచుకోకపోతే ఇలాగే సంవత్సరాల పాటు అసెంబ్లీకి రాకుండా కోర్టుల చుట్టూ తిరాగాల్సి వస్తుందని చురకలు అంటించ గల సామర్ధ్యంలో తను నేర్పరి అని పవన్ ప్రూవ్ చేసుకున్నారు. తనపై వచ్చే విమర్శలకు సరైన సంధర్భంలో ఘాటైన సమాధానం చెప్పే సత్తా పవన్ కు ఉంది.

సిద్ధాంతపరమైన వ్యతిరేకతతో సొంత అన్నను కుడా విభేదించి క్రీయాశీల రాజకీయాలలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న పవన్, తన అన్న చిరుపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించిన రోజులున్నాయి. పవన్ రాసిన “యిజం” పుస్తకంపై మొదట్లో చిరు సెటైర్లు కూడా వేయగా, పవన్ దానికి “రామాయణాన్ని కూడా విమర్శించేవాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు, అలాంటిది నా పుస్తకం ఎంత” అని తిరిగి అన్నకు కౌంటర్ ఇచ్చారు. అలా అని పవన్ కి – చిరుకి మధ్య వ్యక్తిగత కక్షలు లేవు కధ. రాజకీయాలో ఇవన్నీ సర్వ సాధారణం.

రెచ్చిపోయేవాళ్ళు ఉన్నంత కాలం రెచ్చగొట్టే వాళ్ళు వస్తూనే ఉంటారు. చేసిన విమర్శలలో మంచి ఉంటే తీసుకోవడం, లేకపోతే దానిపై ప్రతి విమర్శ చేయడం పవన్ ఇష్టం. అయినా సమస్య ఎక్కడ వస్తుందంటే, అందరి నాయకుల మాదిరి పవన్ ను ఉహించలేకపోవడం, అంచనాలు ఎక్కువగా ఉండడం, ప్రతిదానిపై పవన్ కు పట్టు ఉండాలని పవన్ అభిమానులు భావిస్తుండడం. ఉద్దానం సమస్య పరిష్కరించిన చందంగా ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారాలు చూపాలని భావించడం కుడా ఈ విమర్శలకు దారి తీస్తున్నాయి.

అందరి సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు, ఐటం సాంగ్స్ ఉంటాయి, వాటిని ఎవరు తప్పు పట్టరు కాని అవే సన్నివేశాలు శేఖర్ కమ్ముల సినిమాలలో ఉంటే వాటిని ప్రజలు అంగీకరించలేరు. కారణం ఈయనకు ఉన్న ప్రత్యేకత అది. అలాగే అందరి రాజకీయ నాయకులలో పవన్ ప్రత్యేకత చాటుకున్నారు కాబట్టే అందరితో సమానంగా ఉహించలేకపోతున్నారు. అభిమానులు అంటే ఏ హీరోకైనా అత్యంత ఆప్తుడు అనే అర్ధం. ఆ హీరోతో వ్యక్తిగతంగా ప్రత్యేకమైన సంబంధం అంటూ ఏమి ఉండదు.

కానీ, తమ తమ కుటుంబాలలో ఉండే సభ్యులకు మించి, అభిమానం పేరుతో ఆయా హీరోలను ఎక్కువగా తమ తమ మనసులలో దాచుకుంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తే ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించి, దానికి ప్రతిఫలం కూడా ఆశించని గొప్ప వ్యక్తులే అభిమానులు. ఇంత ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారు ప్రజాస్వామ్యంలో ఒకరు వ్యక్తపరిచిన అభిప్రాయాలను తప్పుగా భావించి, వాటిని భూతద్దంలో పెట్టి చూడడం వలన, తమ హీరో స్థాయినే దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే అందరి మనిషిగా ఉన్న వ్యక్తిని కొందరికే పరిమితం చేయకండి అన్న సూచన అభిమానులకు ఇవ్వడంలో సందేహం లేదు.