Pawan Kalyan Fans waiting for Bheemla nayak trailer గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్మాణ సంస్థలు అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నాయి. తాజాగా “భీమ్లా నాయక్” ట్రైలర్ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సహనాన్ని ప్రొడ్యూసర్స్ పరీక్షించారు. శుక్రవారం నాడు విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ కోసం రోజంతా ఎదురు చూడగా, అది కాస్త శనివారం నాటికి వాయిదా పడింది.

కానీ నేడు కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయాన్ని నిర్మాణ సంస్థ తెలియజేయలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం 24 గంటలుగా ట్రైలర్ కోసం నిరీక్షిస్తూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఒక్క ‘భీమ్లా నాయక్’ విషయంలోనే కాదు, ‘పుష్ప, సర్కార్ వారి పాట’ విషయాలలో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇదే తీరును అవలంభించింది.

తొలుత ఒక తేదీ సమయం ప్రకటించడం, కానీ ఆ సమయానికి తీసుకురాలేకపోవడం అనేది ఇటీవల కాలంలో చాలా విరివిగా జరుగుతోన్న విషయం. బహుశా పబ్లిసిటీ భాగంగా జరుగుతోందో లేక ప్లానింగ్ లోపం వలన జరుగుతున్నాయో గానీ, తెలుగు ప్రేక్షకులు సినిమా పిచ్చి వాళ్ళు కాబట్టి సరిపోతుంది గానీ, లేదంటే ప్రొడ్యూసర్స్ వ్యవహారశైలితో ప్రేక్షకులు విసిగిపోయే పరిస్థితి నెలకొంది.

అయితే అభిమానులు కూడా మునుపటి కంటే దూకుడుగా సోషల్ మీడియాలో ప్రొడ్యూసర్స్ ను ట్యాగ్ చేసి తమకు కావాల్సింది డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. దీంతో ప్రతి దానికి జవాబిచ్చుకునే పరిస్థితిలో నిర్మాతలు ఉండలేరు, అది అర్ధం చేసుకునే పరిస్థితిలో అభిమానులు లేరు. ఈ పోకడ మారాలంటే, ముందుగా నిర్మాతల్లో ఒక స్పష్టమైన ప్లానింగ్ అయితే కావాల్సి ఉంటుంది.

ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ, పాట గానీ… ఇలా ఏదైనా చెప్పిన సమయానికి రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా కాలయాపన చేస్తూ ప్లానింగ్ లో లోపాలు తలెత్తితే గనుక, సోషల్ మీడియా ట్రోలింగ్ కు నిర్మాతలు బలికాక తప్పదనే సూచనలు కనపడుతున్నాయి. దీనికి ‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్స్ అని, ‘సర్కార్ వారి పాట’ ప్రొడ్యూసర్స్ అని… అలా వాళ్ళు, వీళ్ళు అన్న తారతమ్యం లేకుండా ఎంతటి వారినైనా ప్రేక్షకుల (రవితేజ భాషలో) పేకాడేస్తున్నారు.