Pawan Kalyan Fans tweets on RRR Trailerసోషల్ మీడియా అంతా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న వేళ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులేమో “వకీల్ సాబ్” రిలీజ్ ఆయిన నాటి వీడియోలను షేర్ చేసుకుంటూ హంగామా చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.

‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ను యూట్యూబ్ లో కాకుండా ముందుగా ధియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామాతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా సందడి చేసారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కాయి.

మాస్ హీరోగా తారక్ ఇమేజ్ కు నిదర్శనం ఇదని, ట్రైలర్ కే పరిస్థితి ఇలా ఉంటే, సినిమా రిలీజ్ రోజున ఏ మాత్రం హంగామా ఉంటుందో ఊహించుకోండి అంటూ నందమూరి అభిమానులు చేస్తోన్న కేరింతలు పవన్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టినట్లుగా ఉన్నాయి.

దీంతో అసలు సిసలు మాస్ ఎలా ఉంటుందో చూడండి అంటూ ‘వకీల్ సాబ్’ రిలీజ్ రోజు ఫ్యాన్స్ చేసిన రచ్చ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ లాంటి క్లాస్ సినిమాకే పరిస్థితి ఇలా ఉంటే, త్వరలో రాబోయే మాస్ మూవీ ‘భీమ్లా నాయక్’కు ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

అలాగే ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ సమయంలో ధియేటర్ల వద్ద ప్రేక్షకులు ‘భీమ్లా నాయక్’ పాటలనే పాడుకుంటున్నారని, ఇది పవన్ స్థాయిని సూచిస్తుందని పవర్ స్టార్ గురించి చెప్పుకొస్తున్నారు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ కు – పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తోన్న దానికి ఎక్కడా సంబంధం లేదు.

పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్స్ బేస్ గానీ, పవర్ స్టార్ కున్న మార్కెట్ గురించి గానీ అభిమానులు ఇంత రచ్చకు దారి తీయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇవాళ పవన్ కళ్యాణ్ నిరూపించుకోవాల్సింది కూడా ఏం లేదు. “ఆర్ఆర్ఆర్” వంటి ఒక దేశభక్తి కధతో పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతున్నప్పుడు గర్విస్తూ సహకరించాని కానీ, హీరోల నడుమ ఆధిపత్య పోరాటం గురించి ఫ్యాన్స్ డిస్కషన్స్ ఎందుకో!?

నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానుల పోకడ ఎప్పుడూ చర్చకు దారితీసే అంశమే. అందుకే నాడు అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అని చెప్పించుకునేంత వరకు వెళ్ళింది. ఇంకా లోతుకెళితే, ఒక్కోసారి పవన్ కళ్యాణ్ కే తన అభిమానుల తీరు మింగుడు పడడం లేదు. వివిధ సందర్భాలలో, అలాగే పలు రాజకీయ బహిరంగ సభలలో పవన్ నేరుగానే ఫ్యాన్స్ ను విమర్శించిన విషయం తెలిసిందే.

అభిమాని అంటే తన హీరో ఎదుగుదలను కోరుకునేవారు. మరి ఇతర హీరో అభిమానులతో పెట్టుకునే ఈ వాదనలు పవన్ ఎదుగుదలకు కారణమవుతాయా? పవన్ కు ఒక సినీ హీరోగా అభిమానులు ఇచ్చే సహకారం, రాజకీయంగా అదే అభిమానులు ఇవ్వడం లేదనేది స్పష్టం. తన రాజకీయ ఎదుగుదలకు సహకరించలేని అభిమానగణం పట్ల పవన్ కూడా అసహనంగానే ఉన్నారు.

అయినా ఎవరి హీరో సినిమాలు విడుదలైనప్పుడు సంతోషంతో ఆయా హీరోల అభిమానులు సందడి చేస్తుంటారు. కానీ పవన్ ఫ్యాన్స్ తీరు ఎలా ఉందంటే… ఏ హీరో సినిమా విడుదలైనా మా హీరోనే పొగడాలి అనడం ఎంతవరకు సమంజసమో విజ్ఞులైన పవర్ స్టార్ అభిమానులే ఆలోచించుకోవాలి.