pawan-kalyan-fans-jana-sena-allu-arjunపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రవర్తనతో చాలామంది సినీ సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారన్న మాట వాస్తవం. అయితే ఇది బయటకు చెప్పింది మాత్రం ఒక్క అల్లు అర్జునే. ఏది ఏమైనా కానీయ్ అనుకుని, పవన్ ఫ్యాన్స్ పై తాను చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్ ఏ రీతిలో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత బన్నీ వ్యాఖ్యలకు మరికొందరు కూడా సమర్ధించినా పవన్ కళ్యాణ్ అభిమానుల తీరులో మాత్రం పెద్దగా మార్పు లేకపోయిందన్నది బహిరంగమే.

కట్ చేస్తే… బన్నీ చేసిన వ్యాఖ్యలకు దాదాపుగా ఒకటిన్నర్ర ఏళ్ళు గడిచాయి. ఇపుడు పవన్ కళ్యాణ్ నోటి నుండి కూడా దాదాపుగా అవే వ్యాఖ్యలు వచ్చాయి. “అభిమానం ఉండాలి గానీ, అది ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు” అంటూ తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సూచనలు చేయడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా విజయవాడను ఉద్దేశిస్తూ… “ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది… బాబులకు బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేస్తారు, ఇవన్నీ తనకు నచ్చావు…” అంటూ చెప్పుకొచ్చారు.

“మీ అభిమానం ప్రజలకు ఇరిటేట్ చేసేలా ఉండకూడదు, ఆనందింపచేసేలా ఉండాలి, మీరు పుట్టిన ఈ గడ్డ మీద గౌరవం ఉంటే, నాపై, జనసేన పార్టీపై కాకుండా, భారత్ మాతాకి జై అని చెప్పండి, మీరు ప్రతిసారి సిఎం సిఎం అంటే నేను ముఖ్యమంత్రిని అయిపోతానా? అరుపులు, కేకలతో మార్పులు రావు, ఆలోచనలతో కూడిన సంస్కరణల వలనే మార్పులు వస్తాయంటూ” పవన్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆహ్వనించదగ్గ విషయం. కాస్త ఆలస్యమైనా తన అభిమానులకు పవన్ హితబోధ చేయడం శుభపరిణామం.

అయితే ఇదే అంశాన్ని అల్లు అర్జున్ వివరించి చెప్పినప్పటికీ, అభిమానులలో ఏ మాత్రం ఆగ్రహం తగ్గకపోగా, ఇంకా పెచ్చుమీరింది. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తాజాగా అవే వ్యాఖ్యలు చేయడంతో, విస్తుపోవడం అభిమానుల వంతవుతోంది. మరి కనీసం తన అభిమాన హీరో మాటలైనా వింటారో లేదో భవిష్యత్తు పరిణామాలే చెప్తాయి. మధ్యలో బలిపశువు అయ్యింది మాత్రం ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ అనే చెప్పాలి. అయినా పవన్ కంటే ముందుగానే ఓపెన్ గా చెప్పినందుకు బన్నీని అభినందించాల్సిందే.