Pawan Kalyan explanation on kcr meetతమ పార్టీ తెలంగాణ, ఆంధ్ర ప్ర‌దేశ్‌ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, రాష్ట్రాల్లో త‌మ‌కు బలం ఉన్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామ‌ని వివ‌రించారు. తాము ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనే విష‌యం ఎన్నిక‌లకు రెండు నెల‌ల ముందు అంద‌రికీ తెలుస్తుందని అన్నారు. ఇందు కోసం తాము సీనియర్ జర్నలిస్టులు, మేధావుల సలహాలు కూడా తీసుకుంటామ‌ని చెప్పారు.

తాను రేపు, ఎల్లుండి త‌మ పార్టీ కార్యకర్తలతో చ‌ర్చ‌లు జ‌రుపుతాన‌ని అన్నారు. తాను గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీలకు సదుద్దేశంతోనే మద్దతు పలికానని అన్నారు. తన రాజకీయాలకు, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని, రాజకీయాల్లో తనకు కుటుంబ సభ్యుల మద్దతు లేదని పరోక్షంగా మెగాస్టార్ తన వెనుక లేరన్న అంశాన్ని విస్పష్టంగా తెలిపారు.

విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాలకు చాలా చాలెంజ్‌లు ఉంటాయని, వీటి మధ్యలో ప్రభుత్వాలను చాలా సమర్థవంతంగా నడపాల్సి ఉంటుందని, ఏ పార్టీకైనా సరే ప్రజలు పట్టం కట్టినప్పుడు ఆయా ప్రభుత్వాలను గౌరవించాలని చెప్పారు. దశాబ్దాల తరువాత తెలంగాణ వచ్చిందని, తానెప్పుడూ సునిశితంగా ఆలోచిస్తానని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తానని చెప్పారు.

సమస్యలను సానుకూలంగా ఎలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలో ఆలోచించాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిస్తే తప్పేంటని పవన్ ప్రశ్నించారు. నూతన సంవత్సరం రోజున కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు చెబితే ఇంత రచ్చ ఎందుకు అంత చేసారోనని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, అలాగే ప్రజలు ఓటుతో తీర్పునిస్తే ఆయన గెలిచారని అన్నారు.

కాగా, ప్రజా సమస్యలపై ఎలా పడితే అలా తాను మాట్లాడలేనని, ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కోసం తాను పని చేయనని, ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, వాటిని ప్రభుత్వాల దగ్గరకు తీసుకువెళ్లి ఆ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. విమర్శలు చేస్తూ రాజకీయాలను అస్థిరపర్చే ఉద్దేశం తనకు లేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల ఎంతో అనుభవం ఉన్న నాయకులు త్వ‌ర‌లోనే త‌మ పార్టీలో చేరుతున్నార‌ని చెప్పిన ప‌వ‌న్, భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యంపై తాము విస్తృతంగా చర్చ జరుపుతామ‌ని అన్నారు. రాజ‌కీయ‌ప‌రంగా ఎవరికీ లబ్ధి చేకూర్చే ప‌నులు తాను చేయ‌నని, త‌న ప్ర‌తి అడుగు నిర్మాణాత్మ‌కంగానే ఉంటుందని తెలిపారు.