Pawan Kalyan Effigy burnt in Osmania Universityపవన్ కల్యాణ్ అభిమానులకు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ కు మధ్య వివాదం సుమారు నాలుగు నెలలుగా కొనసాగుతుండగా, అది ముదిరి మరింత పాకాన పడే సంకేతాలు కనపడుతున్నాయి. తనను అసభ్య కామెంట్లతో వేధింపుల పాలు చేస్తూ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ ఫ్యాన్స్ ప్రవర్తిస్తున్నారని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేయాలని కత్తి మహేశ్ డిమాండ్ చేస్తున్న వైనం తెలిసిందే.

తాజాగా ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొని వెళుతున్న మహేశ్ కత్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కారు దిగిన వెంటనే ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. దీంతో మొత్తమ్మీద తాను గుర్తించిన పది మంది వ్యక్తులపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మహేష్ కత్తి ప్రకటించారు.

వాళ్లకు వాళ్లు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ పలు ఛానెల్స్ ద్వారా తనకు చేసిన ఫోన్ కాల్స్, పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగా ఈ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. జనసేన పార్టీకి చెందిన ‘శతఘ్ని’ టీవీలో పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడాడో, ఆ వీడియోను కూడా ఫిర్యాదు చేసేటప్పుడు పోలీసులకు ఇస్తానని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా తాను చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు.

కాగా, ఈ సంఘటనను ఓయూ జేఏసీ ఖండించింది. ఈ సందర్భంగా ఓయూ జేఏసీకి చెందిన రవి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో దాడులు చేయడమనేది అనాగరికమని, ఈ దాడిని తాము ఖండిస్తున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ తన అభిమానులకు మాట మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాంతంలోని అన్ని యూనివర్శిటీలకు ఈ మేరకు సమాచారం అందిస్తామని, పవన్ కల్యాణ్ నటించిన ఏ సినిమాను తెలంగాణలో ఆడనివ్వమని, కత్తి మహేశ్ కు అండగా ఉంటామని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని పిలుపు నిచ్చింది.‘ఖబడ్దార్ పవన్ కల్యాణ్… తెలంగాణలో నిన్ను తిరగనివ్వం. అభిమానులకు చెప్పుకోలేని మూగవాడివి. నీ అభిమానులతో కత్తి మహేశ్ పై దాడి చేయిస్తావా?’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.