pawan-kalyan-doing-remake-mega-family‘తని ఒరువన్’ రీమేక్ లో రామ్ చరణ్… ‘కత్తి’ రీమేక్ లో చిరంజీవి… ‘వీరమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్… ‘వేదాళం’ రీమేక్ లో పవన్ కళ్యాణ్… ఇలా మెగా ఫ్యామిలీకి చెందిన ప్రధాన హీరోలు రీమేక్ మాత్రమే ఎందుకు చేస్తున్నారు? తెలుగులో కొత్త కధలు దొరకక? ఇదే ప్రశ్నను రామ్ చరణ్ అడిగితే ఏం చెప్పారో తెలుసా… కధల కొరత కాదు, రీమేక్ కూడా ఓ సినిమానే కదా… అంటూ ఓ స్ట్రాంగ్ సమాధానం ఇచ్చారు.

ఇతర భాషల్లో మంచి సినిమాలు వచ్చినపుడు వాటిని తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలనే తాపత్రయంలో భాగంగానే రీమేక్ లను చేస్తామే తప్ప, కధలు లేక కాదు, కొత్త కధలను తీయలేక కాదు. ఇప్పుడు ఇద్దరం రీమేక్ లే చేస్తున్నాం, అలాగే “పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ రీమేక్ చేస్తున్నారు,” ఎందుకు మెగా ఫ్యామిలీ హీరోలంతా రీమేక్ లే చేస్తున్నారు అని చింతించకండి… మంచి సినిమాలు వస్తాయి ఆదరించండి… అని ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు.

సినిమాకు అవధులు లేవు, రీమేక్ లు చేయొచ్చు, డబ్బింగ్ చేయొచ్చు… సంక్రాంతికి కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశించండి… అంటూ మెగా ఫ్యామిలీ రీమేక్ సినిమాలపై స్పష్టత ఇచ్చారు రామ్ చరణ్. అయితే చెర్రీ వ్యాఖ్యలు తన ‘ధృవ’ సినిమా కంటే కూడా, మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’పై వస్తున్న విమర్శలకు బదులిచ్చినట్లుగా కనపడుతోంది. మెగాస్టార్ ప్రతిష్టాత్మక సినిమాను రీమేక్ గా ఎంచుకోవడంపై అభిమానులే పెదవి విరుస్తున్న తరుణంలో… వారిని మానసికంగా సిద్ధం చేసేందుకే చెర్రీ కాస్త గట్టిగా స్పందించినట్లు కనపడుతోంది.

అలాగే మరొకసారి చెర్రీ నోటి వెంట ‘బాబాయ్’ అన్న పిలుపుకు బదులు ‘పవన్ కళ్యాణ్ గారు’ అని రావడం గమనించదగ్గ విషయమే. బహుశా మున్ముందు ఇలాగే పిలవబోతున్నామని చెప్పడానికి సంకేతాలు ఇస్తున్నారా? అయితే ‘పవన్ కళ్యాణ్ గారు’ అని చెర్రీ పలికిన సమయంలో అభిమానుల నుండి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం కావడం విశేషం. ‘రీమేక్’లపై ఇంత గట్టిగా రామ్ చరణ్ స్పందిస్తున్నపుడు, పక్కనే ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం ఎలాంటి హావభావాలు పలికించకుండా స్తబ్దుగా ఉండిపోవడం విశేషం.