Pawan Kalyanటాలీవుడ్ లో సినిమా మీద హైప్ తో సంబంధం లేకుండా కేవలం తన బ్రాండ్ మీద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ది ముందు వరస. ఓజి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. రాగానే హరిహర వీరమల్లు పెండింగ్ ఎంతుందో చూసుకుని డేట్లు ప్లాన్ చేసుకుంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ ని మెట్రో స్పీడ్ తో పరుగులు పెట్టించేందుకు హరీష్ శంకర్ సర్వసన్నద్ధంగా ఉన్నాడు. వినోదయ సితం రీమేక్ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రిలీజ్ డేట్ లాకైపోయింది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు.

ఇదంతా అభిమానుల కోణంలో కిక్కిచ్చే విషయాలు. కేవలం ఏడాదిన్నర గ్యాప్ లో పవన్ నాలుగు సినిమాలు రిలీజ్ కావడం పాతికేళ్ల కెరీర్ లో ఎప్పడూ జరగలేదు. పైన చెప్పిన ప్లానింగ్ ప్రకారం అన్నీ పూర్తయితే ఇదే జరుగుతుంది. ఫ్యాన్స్ కి ఇంతకన్నా సంబరం ఇంకేమీ ఉండదు. అయితే పవన్ కు అసలైన బాధ్యత జనసేన రూపంలో ఎదురు చూస్తోంది. రాజకీయ యాత్ర కోసం చేయించి పెట్టిన వారాహి వాహనం ఇంకా రోడ్ల మీద పూర్తి స్థాయిలో రాలేదు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు సంబంధించిన పొత్తుల వ్యవహారం ఇంకా తేలనే లేదు.

Also Read – భువనేశ్వరికి బాలయ్య దీవెనలు… అన్నయ్యకి షర్మిల శాపాలు

షూటింగులపరంగా చూపిస్తున్న దూకుడు పవన్ పాలిటిక్స్ లోనూ ఫాలో కావాలన్నది జనసేన వీర ఫాలోయర్స్ డిమాండ్. వాళ్లకు థియేటర్లో తెరమీద తమ హీరోని చూసుకోవడం కన్నా ఏపీ రాజకీయ వ్యూహంలో చక్రం తిప్పాలని కోరుకుంటున్నారు. అది జరగాలంటే ఇప్పుడున్న యధాస్థితి సరిపోదు. ఎందుకంటే ఎంతసేపూ మీడియాలో పవర్ స్టార్ మూవీస్ మీద కథనాలు వస్తున్నాయి తప్పించి జనసేన భవిష్యత్తు గురించి కాదు. ఓజి స్టిల్స్ చూసి వెర్రెత్తిపోతున్న ఫ్యాన్స్ తమ ఖద్దరు దుస్తుల నాయకుడిని తేలిగ్గా మర్చిపోతున్నారు.

ఇక్కడితో కథ అయిపోలేదు. పవన్ దగ్గరికి నిర్మాతలు వస్తూనే ఉన్నారు. తక్కువ కాల్ షీట్లతో భారీ రెమ్యునరేషన్ ఇచ్చి త్వరగా పూర్తి చేస్తామని టెంప్ట్ చేస్తున్నారు. వెనకాల త్రివిక్రమ్ ప్రోత్సహిస్తున్నారా లేదానేది అనవసరం. చేతిలో ఏడాది కూడా లేని పరిస్థితిలో పవన్ స్పీడ్ ఏ మలుపు వైపు తీసుకెళ్తుందనేది అంతు చిక్కడం లేదు. ఇప్పుడు చేసే సినిమాలు వసూళ్లు తెస్తాయి కానీ ఓట్లు రాలనివ్వవు. టికెట్లు తెగేలా చేస్తాయి కానీ బ్యాలట్ పేపర్లు నింపవు. అలాంటప్పుడు రెండు పడవల ప్రయాణంలో పవన్ ఒకవైపే మొగ్గు చూపుతున్న రిస్కుని వీలైనంత త్వరగా పసిగట్టాలి. స్ట్రాటజీలు ఎన్నైనా ఉండొచ్చు అమలు పరచడంలో ఆలస్యం జరిగితే నష్టం ఎవరికి.

Also Read – ఇంకా తత్త్వం బోధ పడలేదా..? ఇప్పటికైనా కళ్ళు తెరవండి.!