Pawan Kalyan Disappointed Kakinada Meeting, Pawan Kalyan Disappointed Kakinada Janasena Sabha, Pawan Kalyan Disappointed Kakinada AP Special Status Meetingపవన్ ఏం చెప్తారు… పవన్ ఏం చెప్తారు… గత 24 గంటలుగా మీడియా వర్గాలు, ఏపీ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఆ మాటకొస్తే… ఏపీ సర్కార్ మరియు కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా పవన్ ఏం మాట్లాడతారనే దానిపై ఉత్సుకతతో ఎదురుచూసారు. మరి పవన్ ఏం మాట్లాడారు? అని అంటే… ఏం చెప్పాలో తెలియని పరిస్థితులలో ఈ సభ జరిగింది… అలాగే ముగిసింది కూడా..! అలా చెప్పడానికి ఓ కారణముంది.

తిరుపతిలో సభ పెట్టిన సమయంలో ‘జనసేన’ భవిష్యత్తును పవన్ వివరించడం, అలాగే దీనిని ఇక్కడితో వదిలేది లేదు, కాకినాడలో మీటింగ్ పెడతా అంటూ తేదీతో సహా చెప్పడంతో… పొలిటికల్ వర్గాలలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. మరి కాకినాడ మీటింగ్ తర్వాత ‘జనసేన’ ఏం చేయబోతోంది? ‘ప్రత్యేక హోదా’పై పవన్ కళ్యాణ్ ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? దీనికి సమాధానాలు మాత్రం పవన్ ప్రసంగం ఇవ్వలేకపోయింది.

కేంద్రం ఇటీవల ఇచ్చిన ‘ప్యాకేజ్’లను పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ ఆలోచన బాగానే ఉంది. కానీ, అవి తీసుకోకపోతే రాష్ట్ర పరిస్థితి ఏమిటన్నది కూడా పవన్ చెప్తే, ఆ ‘పాచిపోయిన లడ్డూ’ల మాట జనాల్లోకి ఇంకా బాగా వెళ్లి ఉండేది. ఈ ‘లడ్డూ’ల ప్రకటన ఇవ్వడానికే రెండున్నర్ర సంవత్సరాల సమయం తీసుకున్న కేంద్రం, ‘తానూ రంగంలోకి దిగితే సాధించుకొస్తాను’ అని పవన్ చెప్పినంత తేలికగా ‘ప్రత్యేక హోదా’ ప్రకటన చేస్తుందా? అన్నది ఒక్కసారి పవనే ఆలోచించుకోవాల్సి ఉంది.

మొన్నటి వరకు ‘స్పెషల్ స్టేటస్’పై పరోక్షంగా చెప్పిన కేంద్రం, రెండు రోజుల క్రితం కుండ బద్దలు కొట్టినట్లు ‘తాము ఇవ్వం’ అని స్పష్టంగా తమ అభిప్రాయాన్ని చెప్పేసింది. అలాగే ‘ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో ఎంతిస్తే అంత తీసుకోవడం తప్ప చేసేదేమీ లేదని’ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పేసింది. మరి అలా చెప్పిన తర్వాత కూడా, ‘ఇంకా మీరు పోరాటం చేయండి’ అని పవన్ కళ్యాణ్ అనడంలో అర్ధం ఉందంటారా? వాళ్ళు చేసేదేమీ లేకే కదా ప్రజలంతా మీ వైపుకు చూసింది.

అధికారంలో ఉన్న తెలుగుదేశానికి కేంద్రం ఏమిస్తే అది తీసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పవన్ చెప్పినట్లు ‘అవకాశవాద రాజకీయం’ తప్ప మరో మాట లేదు. ఈ తరుణంలో ‘ప్రత్యేక హోదా’ను పవన్ నెత్తిన పెట్టుకుని కార్యాచరణ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూసింది. కానీ, పవన్ మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడమే ఈ నిరాశకు ప్రధాన కారణంగా మిగిలింది. దీంతో ‘ప్రత్యేక హోదా’ అన్న అంశం తెరమరుగు కావడం ఖాయం అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

చివరగా… ఈ కాకినాడ సభలో కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటున్నాను అని చెప్పి… సీమాంధ్రలో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పవన్.., అర్ధంతరంగా ఎందుకు ప్రసంగం ముగించారో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి. సభా సమయం కూడా 4 నుండి 6 గంటల వరకు అని అనుమతి తీసుకున్న ‘జనసేన’ అధినేత 5 గంటలు దాటిన కొద్దిసేపటికే ప్రసంగాన్ని ఉన్నట్లుండి ముగించేయడం విస్మయానికి గురిచేసిన అంశం. ఇలాంటి వ్యవహార తీరు వలనే పవన్ లో ‘నిలకడ లేదన్న’ ప్రత్యర్ధుల విమర్శలకు ప్రాధాన్యత లభిస్తోంది.