Pawan Kalyan dharna in Amaravati జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను కలిసి వారికి సంఘీభావం తెలపడానికి వెళ్లారు. అయితే ఆయన పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా…మందడం పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక రైతులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పవన్ అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 200 మంది పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచె వేసి, పొక్లెయిన్ అడ్డుగా పెట్టి కాన్వాయ్ ముందుకెళ్లకుండా చేశారు.

దీంతో భారీగా ఉన్న జనసేన కార్యకర్తలు, రైతులు ఇనుపకంచెను తొలగించి పవన్ ముందుకు సాగేందుకు మార్గం సుగమం చేశారు. అయితే తగ్గేది లేదని పవన్ కారు దిగి కాలినడకన మందడం బయల్దేరారు. పాదయాత్రగా మందడం వెళ్తానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఈ సందర్భంగా పవన్ హెచ్చరించారు.

ఈ సందర్భంగా జనసైనికులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందస్తు అనుమతులు తీసుకున్నా.. తమకు ఆటంకాలు కలిగించడం సరికాదని పవన్ అన్నారు. తమ పర్యటనను కావాలనే పోలీసులు అడ్డుకున్నారని, ప్రభుత్వానికి వారు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జనసేన కార్యకర్తలు విమర్శించారు.