Pawan Kalyan - dharana for amaravati farmaresప్రత్యేక హోదా… మీరెవరూ రోడ్ల మీదకు రావద్దు, మీ అందరి తరపున నేనే పోరాటం చేస్తా, విద్యార్ధులు చక్కగా చదువుకోండి, ఉద్యోగస్తులు విధులు నిర్వహించుకొండి, నేనే నిరసనలు తెలుపుతా, అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా, ఇంకా అవసరమైతే నా ప్రాణాలు అర్పిస్తా – పవన్ కళ్యాణ్

ఇలా కారణం ఏదైనా గానీ, పవన్ ప్రసంగంలో కంటెంట్ మాత్రం దాదాపుగా అన్ని కీలక అంశాలపై ఇలాగే ఉంటుంది. తన వద్దకు వచ్చిన సమస్యలపై కూడా ఇలాంటి అభయ హస్తాలనే పవన్ ఇస్తుంటాడనేది ట్రేడ్ టాక్ కూడా! కట్ చేస్తే… తాజాగా అమరావతిలో రైతులతో భేటీ అయిన సందర్భంలో కూడా ఇవే డైలాగ్స్. అంతకుముందు ఇదే ప్రాంతంలో ఇలాంటివే చాలా సందర్భాలలో చెప్పారు గానీ, మళ్ళీ కొత్తగా మరొకసారి వినిపించారు.

భూసేకరణకు తాను వ్యతిరేకినని, అలాంటి ప్రతిపాదనలు తనకు ఎన్నికలకు ముందే తెలిసి ఉంటే ఖచ్చితంగా టిడిపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవాడిని కాదని, భూములు బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తే, ప్రాణాలు ఇవ్వడానికి తానే ముందుంటానని, మరోసారి రైతులను ఉత్తేజపరిచే పనిచేసారు ‘జనసేన’ అధినేత. మాటలేగా చెప్తే పోయేదేముంది… అన్న చందంగా ఎక్కడికి వెళ్తే అక్కడ మీ కోసం ప్రాణాలు అర్పించేస్తాను అని చెప్పడం పవన్ కు పరిపాటిగా మారిపోయింది.

నాణానికి మరో యాంగిల్ లో చూస్తే… ఇదే పవర్ స్టార్, తనకు ప్రాణహాని ఉందని బహిరంగ సభలలో ‘సింపతీ’ కోసం ఊకదంపుడు ప్రసంగాలు చేస్తుంటారు. అంత ప్రాణహాని సమాచారం ఉందని తెలుసుకున్న పవన్, ఎవరి దగ్గరి నుండి ఉందో, అందుకు తగిన సాక్ష్యాలు ఏమిటో కూడా బయట పెడితే, నిజంగా ప్రజలకు కూడా ఎవరు ఎలాంటి వారో తెలిసి వస్తుంది కదా! ప్రజలను ఉద్వేగభరితులను చేసి, తద్వారా రాజకీయ లబ్ది పొందే ప్రక్రియలో జనసేన అధినేత కూడా భాగస్వామ్యుడు అయిపోవడం విస్తుపోయే అంశం.