HariRama Jogaiah Pawan Kalyanకాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కాపులకి 5 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని కోరుతూ నేటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో తన నివాసం వద్ద నిరవదిక నిరాహారదీక్షకి సిద్దమయ్యారు. కానీ పోలీసులు ఆదివారం రాత్రే ఆయనను అదుపులో తీసుకొని అంబులెన్సులో హాస్పిటల్‌కి తరలించారు. ఆయన నివాస ప్రాంతంలో బారీగా పోలీసులను మోహరించారు.

అగ్ర వర్ణాలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలోనే 5 శాతం కాపులకి కేటాయించాలని ఆయన కోరుతున్నారు. ఇంతకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు శాసనసభలో దాని కోసం బిల్లును ప్రవేశపెట్టారని, గవర్నర్‌ చేత ఆమోదింపజేసే సమయానికి ప్రభుత్వం మారిపోవడంతో నేటికీ కాపులకి 5 శాతం రిజర్వేషన్లు అమలుకాలేదని చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. కనుక ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్లు కేటాయించాలని లేకుంటే తాను హాస్పిటల్‌లో దీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ, “చేగొండి హరిరామ జోగయ్య వయసు (85)ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌పై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. దీని కోసం రాష్ట్ర శాసనసభ తీర్మానం కూడా చేసింది కనుక కాపులకి 5 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.

మరోవైపు ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా ఇదే విషయం గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు లేఖలు వ్రాశారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా కాపులకి రిజర్వేషన్స్ కల్పించాలన్నారు. కాపులలో సమర్ధుడు, అందరినీ కలుపుకుపోగలవాడు ముఖ్యమంత్రి అయితే తప్పు లేదన్నారు. పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ నేతలకు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. కానీ ఇంతవరకు వైసీపీలో ఎవరూ పేర్ని నాని చేసిన కాపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించలేదు.