Pawan-Kalyan-Controversy-Mahesh-Kathiసినీ నటుడిగా ఎలా చలామణి అయినా పర్లేదు, మహా అయితే నాలుగు సినిమాలు చేయాల్సిన చోట ఓ రెండు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన తర్వాత ‘పట్టు – విడుపు’ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే… పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో చెప్పినట్లు… ‘ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు…’ అన్న డైలాగ్ ను ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు గుర్తు చేయక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఇలాంటి డైలాగ్స్ కేవలం సినిమాల్లో చెప్పడం కాదు, నిజజీవితంలో చేసి చూపించాలన్న సలహాలు అయితే కోకొల్లలు.

“ఎవరో కత్తి మహేష్ కు నేను జవాబు ఇచ్చేదేంటి?” అన్న స్థాయి పవన్ కళ్యాణ్ కు ఉండడం సహజమే. కానీ తాను ఇలాంటి వాటికి దూరం, తన ప్రపంచంలో ప్రతి ఒక్కరు సమానులే, రాగద్వేషాలకు తాను అతీతం, తాను ఒక సామాన్యుడినే, నాకు సామాన్యుల కష్టాలు తెలుసు, నా తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, ఒక సాధారణ కత్తి మహేష్ విషయంలో ప్రదర్శిస్తోన్న విధానం మాత్రం విమర్శలకు తావు తీసేదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే… ఆదివారం నాటి ప్రెస్ మీట్ మరియు మీడియా లైవ్ తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని అర్ధమవుతోంది.

ముఖ్యంగా ఈ సమస్యలోకి హీరోయిన్ పూనం కౌర్ వచ్చి చేరడం.., ఆమె పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్లు చేయడం.., వాటిని డిలిట్ చేయడం… వంటి పరిణామాలు కత్తి మహేష్ కు అనుకూలంగా మారాయని చెప్పొచ్చు. అయితే ‘దీనిపై తాను ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదు, ఇంకా టైం ఉంది’ అని పవన్ అనుకుంటున్నారో ఏమో గానీ, గతంలో ‘స్పెషల్ స్టేటస్’ అంశంలో కూడా మీడియా వర్గాలు పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకువచ్చినపుడు, ‘ఇప్పుడు కాదు, దానికి చాలా సమయం ఉందంటూ’ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ‘స్పెషల్ స్టేటస్’ గురించి మాట్లాడడానికే అవకాశం లేకుండా పోయిన వైనం తెలిసిందే.

నిజానికి ‘తెగేదాకా లాగడం’ అనేది చిరు వారసత్వంగా సంక్రమించినట్లుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ టికెట్ల పంపిణీ వ్యవహారంలో ‘ఎమ్మెల్యే, ఎంపీల టికెట్లు అమ్ముకుంటున్నారు’ అని ప్రత్యర్ధి వర్గాలు చేసిన ఆరోపణలు ఖండించకపోవడంతో, అవి ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయాయి. చివరికి వాటి పర్యవసానాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం కత్తి మహేష్ ఉదంతాన్ని కూడా పవన్ కళ్యాణ్ ‘తెగే దాకా లాగే’ పనిలో ఉంటే మాత్రం, చివరికి అది తనకే చేటు చేస్తుందని చెప్పకతప్పదు. అందులోనూ తనకున్న వ్యక్తిగత ఇమేజ్ రీత్యా, ప్రస్తుతం సీన్ లోకి వచ్చిన పూనం కౌర్ పేరు రీత్యా, దీనికి ఎంత త్వరగా ‘శుభంకార్డు’ వేస్తే అంత మంచిందని చెప్పాలి.