Pawan kalyan contesting from 2 locationsజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పోటీ చేసే అంశంపై ఒక స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని పవన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఏయే స్థానాల్లో పోటీ చేసే విషయాన్ని గంట తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుండి గాజువాక దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఉభయగోదావరి జిల్లాలలోని పిఠాపురం, భీమవరం నుండి ఒక దానిలో పోటీ చెయ్యవచ్చని తెలుస్తుంది.

పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి బాటను అనుసరిస్తున్నారనే చెప్పాలి. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు. పాలకొల్లులో ఘోరంగా ఓడిపోయారు. ఈ సారి జనసేన పాలకొల్లు టికెట్ వైకాపాలో టికెట్ నిరాకరింపబడి పార్టీలోకి వచ్చిన గుణ్ణం నాగబాబుకు కేటాయించింది.

దీనితో పాలకొల్లు అవకాశం లేనట్టే. సహజంగా ఏదైనా నాయకుడు రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారంటే దానికి రెండు కారణాలు ఉండవొచ్చు. ఒకటి ఎక్కువ జిల్లాలలో ప్రభావం చూపించగలగడం. రెండు గెలుపుపై పూర్తి స్థాయిలో నమ్మకం లేకపోవడం. పవన్ కళ్యాణ్ ఆశలన్నీ ఈ సారి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల మీదే. కాబట్టి ఈ రెండు చోట్ల నుండే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే గతంలో చిరంజీవి రెండు చోట్ల నుండి పోటీ చేసినప్పుడు… పాలకొల్లు లో అది వ్యతిరేకంగా పని చేసింది.

రెండు చోట్లా గెలిస్తే ఒక చోట రాజీనామా చెయ్యడం ఖాయం కాబట్టి పాలకొల్లు రాజీనామా చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. దీనితో పాలకొల్లులో ప్రజలు ఆయనను ఓడించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటనేది చూడాలి. ఈ ఎన్నికల వరకు గౌరవప్రదమైన సీట్లను సాధించి అవకాశం వస్తే కింగ్ మేకర్ గా అవతరించాలనే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఈ ఏడాది మొదటి నుండి జనసేన గ్రాఫ్ కొద్దిగా తగ్గడం గమనార్హం.

Pawan Kalyan contesting from Bhimavaram and Gajuvaka