Pawan Kalyan congratualatesDirector K Vishwanath పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ను చూసి ఎంతమంది ఇష్టపడతారో చెప్పడం కష్టం గానీ, పవన్ వ్యక్తిత్వం చూసి ఎక్కువ మంది అభిమానిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. తనకు డ్యాన్స్ రాదని, అలాగే ఒకే తరహా నటన అయినప్పటికీ తనకు వచ్చిందే చేస్తాను తప్ప, కొత్తది ట్రై చేయనని… ఇలా నిర్మొహమాటంగా చెప్పే పవన్ కళ్యాణ్… తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ‘కళాతపస్వి’ విశ్వనాథ్ ను అభినందించడానికి వచ్చిన సమయంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి, అభిమానుల మనసు దోచుకున్నాడు.

ఇప్పటివరకు ఏపీకి ఏమీ ఇవ్వలేదంటూ కేంద్రాన్ని విమర్శించే క్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఎన్ని విమర్శలు చేసారో, ప్రస్తుతం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మన తెలుగు వ్యక్తి విశ్వనాథ్ పేరును వెంకయ్య నాయుడు ప్రకటించడంపై ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్. అలాగే విశ్వనాథ్ గారంటే ఎంతో గౌరవమని, ఆయన చేసిన సినిమాలంటే తనకెంతో ఇష్టమని, ఆయన దర్శకత్వం వహించిన 12 అద్భుతాలను ఒక డిస్క్ లో రూపొందిస్తామని చెప్పిన పవన్, ఆయన సినిమాల్లో నటించేటంత సామర్ధ్యం, ప్రతిభ తనలో లేవని ఒప్పుకున్నారు.

అవును… విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించాలంటే నటీనటులకు విలక్షణమైన ప్రతిభ కలిగి ఉండాలి. అది జగమెరిగిన సత్యమే. అది ఈనాటి నటుల్లో అతికొద్ది మందికి మాత్రమే సొంతం. ఆ జాబితాలో పవన్ ఉండరన్న విషయం కూడా బహిరంగమే. అయితే ఇదే విషయాన్ని పవన్ స్వయంగా ఒప్పుకోవడం మాత్రం పవర్ స్టార్ గొప్పతనంగానే భావించాలి. ఏమీ లేకపోయినా… హంగులు, ఆర్భాటాలతో ఏదో ఉందని అభూత కల్పనలు సృష్టించే ఇండస్ట్రీలో పవన్ లాంటి వ్యక్తులు మాత్రం అరుదనే చెప్పాలి.

టాలెంట్ లేకపోవడం గొప్పకాదు, దానిని ఒప్పుకోవడం మాత్రం గొప్పతనం క్రిందే భావించాలి. అయితే ఇదేదో అప్పటికప్పుడు అలవర్చుకుందామంటే వచ్చేవి కాదు, సహజసిద్ధంగా ఉంటే తప్ప… ఇలాంటి వ్యాఖ్యలు రావు. అందులోనూ ఇండస్ట్రీ ప్రపంచంలో… అస్సలు సాధ్యం కాదు! అందుకే కదా… పవన్ కళ్యాణ్ అన్న పేరు వినగానే అభిమానులు పడిచచ్చేది! మరి ఇలా నిర్మొహమాటంగా మాట్లాడే పవన్, రేపటి రోజుల్లో ఎంతటి స్థాయికి వెళ్తారనేది అభిమానులకు అత్యంత ఆసక్తికరంగా మారిన విషయం.