Pawan Kalyan compares voters with beggarsజనసేన ఎన్నికల ఫలితాల రివ్యూ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కొంత మందిని అడిగాను ఓటుకు ఎంతిచ్చారు అని. రూ.2 వేలు అని చెప్పారు. రూ.2 వేలను ఐదేళ్లకు విభజిస్తే రోజుకు రూపాయి వస్తుంది. గుడి దగ్గర భిక్షాటన చేసుకునే వారికి కూడా అంతకంటే ఎక్కువే వస్తాయి’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ మీడియా విభాగం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

డబ్బు రాజకీయాలను అందరూ ఖండించాల్సిందే కాకపోతే ప్రజలను బిచ్చగాళ్ళతో పోల్చడం ఆక్షేపణీయమే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. కొందరు జనసేన ఎన్నికలకు సన్నద్ధం కాకపోవడం వల్ల వచ్చిన ఓటమిని ప్రజల మీదకు గెంటేయడం భావ్యం కాదని అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఆ పార్టీ మీడియా విభాగం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొనడం కొసమెరుపు.

మరోవైపు తన చివరి శ్వాస వరకు జనసేన పార్టీని మోస్తానని, ఇక ముందు కూడా బలంగా నిలబడతానని, అందరికీ అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి అంతా వెళ్లిపోయినా తాను ఒక్కడినే నిలబడతానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేమో చూస్తానని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ తన ఆశయాలనే చూశారని, ఇకపై తన రాజకీయ ఎత్తుగడలు చూపిస్తానని చెప్పారు.