pawan kalyan comments on ysr congress party2019 ఎన్నికలలో వైసీపీ అత్యంత తేలికగా గెలవడానికి కారణమైన అంశాలలో టీడీపీ – జనసేన ఓట్ బ్యాంకింగ్ వీడిపోవడం అత్యంత ప్రాధాన్యతను దక్కించుకుంది. 175 నియోజకవర్గాలలో ఎక్కువ శాతం నియోజక వర్గాలలో 2,3 స్థానాలలో ఉన్న టీడీపీ + జనసేన ఓట్లను కలిపితే మొదటి స్థానంలో ఉన్న వైసీపీని మించిపోయే విధంగా ఉండడంతో, జనసేన ఒంటరి పోటీ వైసీపీకి అనుకూలంగా మారిందనేది సుస్పష్టం.

ఈ సారి కూడా దీనిపైనే జగన్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని చెప్పడంలో సందేహం లేదు. అందుకే పవన్ ఎలాంటి ప్రసంగం చేసినా అది చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ అంటూ గత మూడేళ్ళుగా ప్రచారం చేస్తూనే వస్తున్నారు. అయితే ఇందులో ఉన్న నిజానిజాలు, వైసీపీ అసత్యపు ప్రచారాలు దాదాపుగా ప్రజల్లోకి ఒక్కొక్కటిగా వెళ్లడంతో, అధికార పార్టీ ‘అసలు రంగులు’ బయటకు వస్తున్నాయి. గతం ఎలా గడిచినా, భవిష్యత్తులో మాత్రం వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకతాటి పైకి వస్తాయని పవన్ స్పష్టమైన ప్రకటన చేయడంతో, జగన్ ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది.

2024 ఎన్నికలలో జనసేన – బీజేపీ – టీడీపీల కలయిక అనివార్యం అవుతుందని, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరమూ కలవాల్సిన ఆవశ్యకత ఉందని తేల్చి చెప్పడంతో, ఇటీవల చంద్రబాబు చెప్పిన ‘వన్ సైడ్ లవ్’ కాదు, ఇది రెండు వైపుల నుండి సాగుతుందని స్పష్టమైంది. “వైసీపీ వ్యతిరేక ఓటును” చీల్చే ప్రసక్తే లేదని చెప్పిన మాటలు బహుశా అధికార పార్టీ గుండెల్లో నేరుగా బాణాన్ని దింపినట్లే రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

నేను నలుగురికి ఇచ్చేవాడినే కానీ, అడిగేవాడిని కాదు. పది మందికి పెట్టేవాడినే గానీ, దోచుకునే వాడిని కాదు. ఎవడి దగ్గర నుండి ఏమీ ఆశించే వాడిని కాదు. అందరూ బాగుంటే చాలని అనుకునే వాడిని. అయిదేళ్లకొకసారి వచ్చే ఎన్నికలలో అధికారం కోసం ఆలోచించే వాడిని కాదు, భవిష్యత్తు తరాల కోసం ఆలోచించేవాడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను ఈ పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు, జనసేన తీసుకుంటుందని తనదైన స్టైల్ లో ఉద్వేగభరితంగా ప్రసంగాన్ని ముగించారు.